MALLANNA: బీసీ నినాదంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ

తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త పార్టీ పురుడుపోసుకుంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. తన పార్టీకి ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ అని పేరు పెట్టారు. తాజ్‌కృష్ణ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్త రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు. సెప్టెంబర్ 17వ తేదీ బీసీల తలరాత మారే దినంగా తాను భావిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో మెజార్టీ సంఖ్యలో ఉన్న బీసీలకు రాజకీయ పార్టీ అవసరం ఉందన్న ఉద్దేశంతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు బీసీల ఆత్మగౌరవమే ప్రధాన ఎజెండాగా ఈ పార్టీని స్థాపించినట్లు ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక దినమైన సెప్టెంబర్ 17న పార్టీని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పార్టీ జెండా ఇలా...
ఎరుపు, ఆకుపచ్చ రంగుల కలబోతతో తెలంగాణ రాజ్యధికార పార్టీ జెండాను తీన్మార్ మల్లన్న ఆవిష్కరించారు. జెండా మధ్యలో కార్మిక చక్రాన్ని, దాని నుంచి పైకి లేస్తున్నట్లుగా పిడికిలి బిగించిన అరచేతి చిహ్నంగా పొందుపరిచారు. జెండాపై 'ఆత్మగౌరవం, అధికారం, వాటా' అనే నినాదాన్ని ముద్రించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ప్రకటించారు. అధ్యక్షుడిగా తీన్మార్ మల్లన్న వ్యహరించనున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మాదం రజినీ కుమార్ యాదవ్, సూదగాని హరిశంకర్ గౌడ్లను నియమించారు. ప్రధాన కార్యదర్శులుగా వట్టే జానయ్య యాదవ్, సంగెం సూర్యా రావు, పల్లెబోయిన అశోక్ యాదవ్, జ్యోతి పండల్ వ్యహరించారు. పార్టీ కార్యవర్గంలో త్వరలోనే యువతకు కూడా స్థానం కల్పిస్తామని వారంతా తెలంగాణ రాజ్యాధికార పార్టీని ముందుండి నడిపించాలని పిలుపునిచ్చారు. మిగతా విభాగాలకు సంబంధించి కార్యవర్గాలను త్వరలోనే ఎన్నుకుని ప్రకటిస్తామని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించబోతోందని తీన్మార్ మల్లన్న వెల్లడించారు.
తీన్మార్ మల్లన్న కీలక వ్యాఖ్యలు
బీసీల చేతిలో భూములు, సంపద మ, జకీయ అధికారం అమలు చేయడం లక్ష్యమని చెబుతున్నారు. "తెలంగాణ గడ్డ మీద బీసీలు తమకు తాముగా ఒక రాజకీయ పార్టీని తీసుకొచ్చామని బీసీలు ఏకం చేసి, వారి హక్కుల కోసం పోరాడతాము." అని ప్రకటించారు. అయితే మల్లన్న పార్టీ పెట్టడం ఇదే మొదటి సారి కాదు. 2023లో 'తెలంగాణ నిర్మాణ పార్టీ' పేరుతో కొత్త పార్టీ ప్రకటించారు, కానీ అది ముందుకు సాగలేదు. ఇప్పుడు బీసీ ఎజెండాతో కొత్తగా ప్రయత్నిస్తున్నారు. తీన్మార్ మల్లన్న రాజకీయంగా ముఖ్యమంత్రి స్థానాన్నిపొందాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో బీసీ సంఘాల కోసం సభలు నిర్వహించారు. ఇప్పుడు నేరుగా పార్టీ పెట్టడం ద్వారా.. బీసీల్లోని అన్ని కులాలను ఏకంగా చేసి ఆయన రాజ్యాధికారం చేపట్టాలని అనుకుంటున్నారు.
వచ్చేది బీసీ ముఖ్యమంత్రే
రాబోయే రోజుల్లో బీసీలు అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో కలిసి బీసీలు తెలంగాణలో అధికారం సాధిస్తారని తెలిపారు. 2028లో ఒక బీసీ వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నారని మల్లన్న విమర్శించారు. బీసీలను మోసం చేసిన అగ్రవర్ణ పార్టీలను గోల్కొండ కోట వరకు తరిమికొట్టకపోతే తన పేరు తీన్మార్ మల్లన్న కాదంటూ సవాల్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలంతా పోటీ చేయడానికి సిద్ధం కావాలని మల్లన్న పిలుపునిచ్చారు. తెలంగాణలో ముదిరాజులు బీసీ ఉద్యమానికి పెద్దన్న పాత్ర పోషించాలని ఆయన కోరారు. బీసీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకువచ్చి ప్రతి బీసీ ఇంటికి రెండెకరాల భూమి పంపిణీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్. ఆయన మొదట జర్నలిస్ట్‌గా పని చేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2021 డిసెంబర్ 7న [బీజేపీ](https://telugu.abplive.com/topic/BJP)లో చేరారు. 2023 నవంబర్ 8న మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com