Manneguda Kidnap: మన్నెగూడ కిడ్నాప్ కేసు.. గంటకో సంచలనం

Manneguda Kidnap: మన్నెగూడ కిడ్నాప్ కేసులో గంటకో సంచలనం బయటికొస్తోంది. ప్రస్తుతం కిడ్నాప్ నుంచి బయటపడిన యువతి పోలీసుల అధీనంలో ఉండగా.. నవీన్‌రెడ్డిపై పోలీసులు కేసులు నమోదుచేశారు. ఈ పరిణామాలతో నవీన్‌రెడ్డి తండ్రి కోటిరెడ్డి అనారోగ్యానికి గురయ్యారు.
దీంతో కుటుంబసభ్యులు ఆయనను వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. అటు ఇంట్లో ఒంటరిగా ఉన్న నవీన్‌రెడ్డి తల్లి నారాయణమ్మ సైతం అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన గురించి తెలుసుకున్నప్పటి నుంచి ఆమె ఆహారం తీసుకోవడం లేదు.
తన కుమారుడు ఎంతో కష్టపడి జీవితంలో పైకొచ్చాడని, నవీన్‌రెడ్డి, యువతి రెండేళ్లుగా కలిసి తిరిగారని చెప్పుకొచ్చారు. ఆ అమ్మాయి చాలాసార్లు తమ ఇంటికి వచ్చిందని, కరోనా సమయంలో అమ్మాయిని నిత్యం కారులో కాలేజీ వద్ద తన కొడుకే దింపేవాడని తెలిపింది.
అంతేకాదు.. నవీన్ రెడ్డి తన వ్యాపారంలో వచ్చిన డబ్బులు సైతం యువతి తండ్రికి ఇచ్చేవాడని బోరున ఏడ్చింది. యువతి ఇంటిపై దాడి చేయడం తప్పే అయినప్పటికీ.. అంతకుముందు జరిగిన విషయాలను కూడా పోలీసులు పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
వ్యాపారంలో మునిగిపోయిన నవీన్ రెడ్డి ఒక్కోసారి పది రోజులు కూడా ఇంటికి వచ్చేవాడు కాదని, అంత కష్టపడి పైకి ఎదిగిన తన కుమారుడిని ఆ యువతి ఎంతో ఇష్టపడిందని నారాయణమ్మ తెలిపారు.
యువతి కిడ్నాప్‌పై గవర్నర్ తమిళిసై ఆందోళన వ్యక్తం చేశారు. యువతి, కుటుంబం భద్రత కోసం చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. యువతి కుటుంబీకులను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పరామర్శించారు. యువతి తండ్రిని ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com