KTR: ట్విట్టర్ వేదికగా కేంద్రమంత్రి మాండవియ, కేటీఆర్‌ మధ్య డైలాగ్ వార్..

KTR: ట్విట్టర్ వేదికగా కేంద్రమంత్రి మాండవియ, కేటీఆర్‌ మధ్య డైలాగ్ వార్..
KTR: మెడికల్ కాలేజీల మంజూరు విషయంలో తెలంగాణకు, కేంద్రంకు మరోసారి వివాదం రాజుకుంది.

KTR: మెడికల్ కాలేజీల మంజూరు విషయంలో తెలంగాణకు, కేంద్రంకు మరోసారి వివాదం రాజుకుంది. ఇదే విషయంపై ట్విట్టర్ వేదికగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మధ్య డైలాగ్‌ వార్ జరిగింది. మెడికల్ కాలేజీల మంజూరులో సీఎం కేసీఆర్‌ చరిత్ర సృష్టించారంటూ ఇటీవల ట్వీట్ చేశారు కేటీఆర్‌.

2014కు ముందు తెలంగాణలో 5 మెడికల్ కాలేజీలుంటే..TRS ఎనిమిదేళ్ల పాలనలో మరో 16 కొత్త మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయని ట్వీట్ చేశారు. కానీ మోదీ సర్కార్ తెలంగాణకు జీరో మెడికల్ కాలేజీలు ఇచ్చిందంటూ ట్వీట్ చేశారు. ఐతే కేటీఆర్ ట్వీట్‌పై స్పందించారు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ. వైద్య కళాశాలల ఏర్పాటు కోసం తెలంగాణ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని ట్వీట్ చేశారు.

స్వల్ప కాలంలోనే దేశంలోని ప్రధాని మోదీ అనేక మెడికల్ కాలేజీలు మంజూరు చేశారని చెప్పారు. ప్రతిపాదనలు పంపిన రాష్ట్రాలకు ఎలాంటి వివక్ష లేకుండా మెడికల్ కాలేజీలు మంజూరు చేసినట్లు చెప్పారు. కేంద్రమంత్రి మన్సుక్‌ మండవియ ట్వీట్‌పై స్పందించారు కేటీఆర్‌. ట్వీట్ చేయడానికి ముందు కేంద్రమంత్రి రివ్యూ చేసి ఉంటారని భావిస్తున్నానంటూ సెటైర్ వేశారు.

మెడికల్ కాలేజీల కోసం 2015 నుంచి 2019 వరకు కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులకు అనేక ప్రతిపాదనలు పంపామని సమాధానమిచ్చారు. అందుకు సంబంధించిన లేఖలను తన ట్వీట్‌కు జత చేశారు కేటీఆర్‌. దీంతో పాటు బీబీనగర్ ఎయిమ్స్‌లో ఖాళీగా ఉన్న 544 పోస్టులను సైతం కేంద్రం భర్తీ చేయలేదన్నారు కేటీఆర్. తెలంగాణకు కేంద్రం ఒక్క విద్యాసంస్థ కూడా ఇవ్వలేదనేది వాస్తవమంటూ ట్వీట్ చేశారు.

అటు మంత్రి హరీష్‌ రావు సైతం తన ట్విట్టర్‌లో ఈ వివాదంపై స్పందించారు. తెలంగాణకు ఏం అడిగినా ప్రపోజల్ పంపలేదని అబద్ధాలు చెప్పడం బీజేపీకి అలవాటై పోయిందన్నారు. గిరిజన రిజర్వేషన్ల పెంపు, ఐటీఐఆర్‌ విషయాల్లోనూ ఇలాగే అబద్ధాలు ఆడి దొరికిపోయారని విమర్శించారు. తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రజలు గమనిస్తున్నారని..బీజేపీకి కర్రు కాల్చి వాతపెట్టడం ఖాయమన్నారు.

Tags

Read MoreRead Less
Next Story