BJP: బీజేపీలో కీలక నేతల చేరికలు.. తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా..

BJP: తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర తీసిన కమల దళం.. కీలక నేతలను చేర్చుకునే పనిలో పడింది. ఈ మేరకు సీనియర్ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, తటస్థులే లక్ష్యంగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ కీలక నేత కారు దిగి కాషాయ దళంలో చేరారు.
ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ తన అనుచరులతో కలసి బీజేపీలో చేరారు. ఢిల్లీలో ఆపార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ నివాసంలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సమక్షంలో భిక్షమయ్యతపాటు పెద్దపల్లి జిల్లాకు చెందిన సురేష్ రెడ్డి కాషాయ కండువా కప్పుకున్నారు. ఇటు తెలంగాణలో టీఆర్‌ఎస్ పాలనకు చమరగీతం పాడేందుకు ఇదే ఆఖరిపోరాటం కావాలని బీజేపీ స్టేట్ చీఫ్ బండిసంజయ్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ, అవినీతి, నియంత పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. కేసీఆర్ ఓటమే లక్ష్యంగా బీజేపీలోకి వస్తున్నవారందరికీ స్వాగతం పలుకుతున్నట్లు బండిసంజయ్ తెలిపారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావొచ్చనే ప్రచారం నేపథ్యంలో నేతలు తమ భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాము ఉన్న పార్టీలో ప్రాధాన్యం దక్కని నేతలు..మాజీ ప్రజాప్రతినిధులు ఇతర పార్టీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com