ఆస్తులు కాపాడుకోడానికే 'ఈటల' బీజేపీలోకి.. మావోయిస్టు నేత ఘాటు లేఖ

మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఇది తన ఆస్తులు కాపాడుకోవడానికే తప్పించి మరొకటి కాదని తెలంగాణ మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్ దుయ్యబట్టారు. ఆయన విడుదల చేసిన లేఖలో మరిన్ని విషయాలు ప్రస్తావించారు. ఈటల రాజీనామా అనంతరం కేసీఆర్ ఫ్యూడల్ పెత్తనానికి పాతరేస్తానని తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడతానని అన్న ఈటల మతతత్వ పార్టీతో చేతులు కలిపారన్నారు.
కేసీఆర్, ఈటల మధ్య ఉన్న విభేదాలు ఏ మాత్రం ప్రజలకు సంబంధించినవి కావన్నారు. ఇద్దరూ ఒకే గూటిపక్షులన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్, ఈటల అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తూట్లు పొడిచారని లేఖలో ప్రస్తావించారు.
మొన్నటి వరకు అధికారాన్ని అనుభవించిన ఈటల తన ఆస్తుల పెంపుకు ప్రయత్నించాడని, అందులో భాగంగానే పేదల భూములు ఆక్రమించాడని అన్నారు. కేసీఆర్ బర్రెలు తీనేవాడు అయితే ఈటల గొర్రెలు తినే ఆచరణను కొనసాగించాడన్నారు. ఈటల తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలంగాణలోని ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకిస్తున్నారన్నారు. అలాగే కేసీఆర్ నియంత పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాడతారని జగన్ లేఖలో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com