MAOIST : మావోలకు మరో ఎదురుదెబ్బ..లొంగిపోయిన దేవ్‌జీ!

తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అడవుల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న మావోయిస్టు ఉద్యమానికి మరో కీలక మలుపు తిరిగింది. భద్రతా బలగాల తీవ్ర నిర్బంధం, వరుస ఆపరేషన్లు, అగ్రనేతల మరణాలు, లొంగుబాట్లతో ఇప్పటికే బలహీనంగా మారిన మావోయిస్టు పార్టీకి ఇప్పుడు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు కనిపిస్తోంది. పార్టీ టాప్ కమాండర్‌గా భావిస్తున్న దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, అలాగే పొలిట్‌బ్యూరో సభ్యుడు రాజిరెడ్డి సహా 16 మంది మావోయిస్టులు తెలంగాణ ఎస్‌ఐబీ ఎదుట లొంగిపోవడం ఉద్యమ భవిష్యత్తుపై గంభీరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, మావోయిస్టు పార్టీ సెక్రటరీగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం. నంబాల కేశవరావు మృతి అనంతరం ఆయన పార్టీకి నాయకత్వం వహిస్తున్నారని వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఆయన అధికారికంగా జనరల్ సెక్రటరీనా కాదా అన్న విషయంపై గతంలో చర్చలు సాగినా, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి ఆయననే ప్రధాన దిక్సూచి అన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు చంద్రన్న గతంలో దేవ్‌జీని సుప్రీం కమాండర్‌గా ఎన్నుకున్నట్లు ప్రకటించగా, మాజీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ వంటి వారు ఆ విషయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్–2, కర్రె గుట్టలు–2 వంటి ప్రత్యేక ఆపరేషన్లను ప్రారంభించాయి. దేవ్‌జీ, రాజిరెడ్డిని లక్ష్యంగా ఈ ఆపరేషన్లు సాగాయి.
మావోయిస్టు పార్టీలో పలువురు అగ్రనేతలు ఎన్‌కౌంటర్లలో మృతి చెందారు. నంబాల కేశవరావు, హిడ్మా, టెక్ శంకర్ తదితరుల మరణం పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. మరికొందరు కీలక నేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, బర్స దేవా వంటి వారు కూడా సరెండర్ అయ్యారు. ఈ పరిణామాలతో పార్టీ బలహీన స్థితిలోకి వెళ్లింది. ఇలాంటి సమయంలో దేవ్‌జీ వంటి అగ్రనేత లొంగిపోవడం ఉద్యమానికి తీవ్రమైన మానసిక దెబ్బగా భావిస్తున్నారు.
ఉనికి కోల్పోయిన మావో ఉద్యమం
రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ కూడా మావోయిస్టు పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, తీవ్ర ఒత్తిడి పరిస్థితుల్లో లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తమ పరిచయాల ద్వారా తెలంగాణలోని పెద్దలతో సంప్రదింపులు జరిపి, చివరకు ఎస్‌ఐబీ ముందు లొంగిపోయినట్లు తెలుస్తోంది. దేవ్‌జీ, రాజిరెడ్డి సహా మొత్తం 16 మంది మావోయిస్టులు అధికారికంగా లొంగిపోవడం విశేషం. మరో రెండు రోజుల్లో వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అగ్రనేత లొంగిపోవడంతో మిగతా కేడర్ కూడా అదే మార్గంలో నడిచే అవకాశాలు ఉన్నాయని భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి. గెరిల్లా తరహా సాయుధ పోరాటం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యంకాదనే నిర్ణయానికి దేవ్‌జీ వచ్చినట్లు తెలుస్తోంది. నిరంతర కంబింగ్ ఆపరేషన్లు, సాంకేతిక పర్యవేక్షణ, ఆర్థిక వనరుల కొరత వంటి కారణాలు ఉద్యమాన్ని బలహీనపరిచినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దేవ్‌జీ- రాజిరెడ్డి లొంగిపోవడం మావోయిస్టు ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లక్ష్య సాధన దిశగా ఇది పెద్ద అడుగుగా భావిస్తున్నారు. అయితే ఉద్యమం పూర్తిగా అంతమైందని చెప్పేందుకు ఇంకా సమయం అవసరం. అయినప్పటికీ, అగ్రనేతల వరుస లొంగుబాట్లు, మరణాలు మావోయిస్టు పార్టీ భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టేశాయి. మార్చి 31 గడువు సమీపిస్తున్న వేళ, ఈ పరిణామాలు దేశ భద్రతా వ్యూహాలకు బలాన్ని చేకూర్చినట్టే కనిపిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
