MEDARAM: గద్దెలపైకి సారాలమ్మ ఆగమనం

తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం వనజాతర బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. జాతర తొలి రోజే లక్షలాది మంది భక్తులతో మేడారం జనసంద్రంగా మారింది. వనదేవత సారలమ్మను గద్దెల ప్రాంగణానికి ఘనంగా ఆహ్వానించే కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా సాగింది. ఈ మహాక్రతువును ప్రత్యక్షంగా దర్శించుకునేందుకు భక్తులు కుటుంబసభ్యులతో కలిసి ఎడ్లబండ్లు, బస్సులు, ప్రైవేటు వాహనాల్లో మేడారానికి భారీగా తరలివచ్చారు.సారలమ్మ ఆగమనానికి ముందు ఉదయం మేడారానికి సమీపంలోని కన్నెపల్లిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన పూజారి కాక సారయ్య ఆధ్వర్యంలో అమ్మవారికి సంప్రదాయబద్ధంగా పూజలు జరిపారు. గ్రామ మహిళలు ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులతో అలంకరించి పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌తో పాటు ఉన్నతాధికారులు కన్నెపల్లి చేరుకున్నారు.
సాయంత్రం వేళ కన్నెపల్లి ఆలయం వద్ద భక్తుల సందడి మరింత పెరిగింది. రాత్రి 7.40 గంటలకు సారలమ్మను ఆలయం నుంచి బయటకు తీసుకురాగానే శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. ఆదివాసీలు సంప్రదాయ నృత్యాలు చేస్తూ, కొమ్ము బూరలు ఊదుతూ అమ్మవారికి ఘన స్వాగతం పలికారు. మంత్రులు, అధికారులు సైతం ఆధ్యాత్మిక వాతావరణంలో తన్మయత్వంతో పాల్గొని వనదేవతకు ఆహ్వానం పలికారు. ఆలయం వెలుపల భక్తులు వరం పడుతూ, పొర్లుదండాలు పెడుతూ తమ భక్తిని చాటుకున్నారు. పూజారులు వెదురుబుట్టలో సారలమ్మను ఉంచి భక్తుల తలలపైగా నడుచుకుంటూ తీసుకువచ్చిన ఘట్టం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు జేజేలు పలుకుతూ అమ్మవారికి నమస్కరించారు. అనంతరం మూడు అంచెల పోలీసు భద్రత మధ్య పూజారులు సారలమ్మను మేడారం వైపు తీసుకువెళ్లారు. మార్గమధ్యంలో జంపన్నవాగును దాటుతూ ఊరేగింపు కొనసాగింది. అనంతరం మేడారంలోని సమ్మక్క ఆలయానికి సారలమ్మ చేరుకున్నారు. అక్కడ ఇప్పటికే పగిడిద్దరాజు, గోవిందరాజులతో వారి పూజారులు సిద్ధంగా ఉన్నారు. సారలమ్మ రాగానే ముగ్గురు వనదేవతల పూజారులు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత గద్దెల ప్రాంగణానికి ఊరేగింపుగా తరలివెళ్లారు.
గద్దెల వద్ద ఎదుర్కోలు కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ముగ్గురు వనదేవతలు గద్దెలపై కొలువు దీర్చారు. వనదేవతల ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. భక్తుల జేజేలు, మంత్రోచ్చారణల మధ్య మేడారం ప్రాంగణం భక్తిరసంతో మార్మోగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
