Medico Preethi : స్వగ్రామానికి ప్రీతి డెడ్ బాడీ, నేడే అంత్యక్రియలు

Medico Preethi : స్వగ్రామానికి ప్రీతి డెడ్ బాడీ, నేడే అంత్యక్రియలు
కొద్దిసేపటి క్రితమే.. జనగామ జిల్లా గిర్ని తండాకు ప్రీతి మృతదేహాన్ని పోలీసు బందోబస్తు నడుమ తరలించారు. విగతజీవిగాపడి ఉన్న కూతురుని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు

సీనియర్ స్టూడెంట్ వేధింపులకు బలైన మెడికో స్టూడెంట్ ప్రీతి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే.. జనగామ జిల్లా గిర్ని తండాకు ప్రీతి మృతదేహాన్ని పోలీసు బందోబస్తు నడుమ తరలించారు. విగతజీవిగాపడి ఉన్న కూతురుని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


అంతకుముందు నిమ్స్‌ ఆస్పత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రీతి మృతికి కారణాలు చెప్పేవరకు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో మంత్రి హరీష్‌ రావు ప్రీతి కుటుంబసభ్యులతో చర్చలు జరిపారు. చివరికి బాధిత కుటుంబానికి 30లక్షల ఎక్స్‌గ్రేషియోతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రీతి ఆత్మహత్యాయత్నంపై నిజనిర్దారణ కమిటీ వేస్తామని.. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో ఈ కేసు విచారణ చేపడతామని చెప్పారు. హెచ్‌వోడీ, ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


బ్రెయిన్‌డెడ్‌తో ప్రీతి మృతిచెందినట్లు రాత్రి 9గంటల 10నిమిషాలకు నిమ్స్‌ వైద్యులు ప్రకటించారు. దీంతో నిమ్స్‌ ఆస్పత్రి వద్ద బాధిత కుటుంబసభ్యులు, గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు ఆందోళనకారుల్ని అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించారు. సీనియర్‌ స్టూడెంట్‌ సైఫ్‌ వేధింపులు తాళలేక మెడికో ప్రీతి ఆత్మ హత్యాయత్నం చేసుకుంది. ఐదురోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడి కన్నుమూసింది.

Tags

Read MoreRead Less
Next Story