MESSI: మెస్సీ నామస్మరణతో మార్మోగిన హైదరాబాద్

హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ కిక్ అదిరింది. మెస్సి పర్యటన యావత్ దేశాన్ని ఆనందంలో ముంచెత్తింది. శనివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో దాదాపు గంటపాటు ఉన్న మెస్సిని చూసి అభిమానులు కేరింతలు కొట్టారు. ముఖ్యమంత్రి సైతం ఆనందంతో మెస్సి.. మెస్సి.. అంటూ సందడి చేశారు. రాత్రి 7.55 గంటలకు ప్రారంభమైన మెస్సి మేనియా 8.52 గంటల వరకూ కొనసాగింది. రాత్రి 7.42 గంటలకు సీఎం రేవంత్, రాహుల్ గాంధీ స్టేడియానికి వచ్చారు. ఆ తర్వాత సింగరేణి ఆర్ఆర్-9 జట్టుతో అపర్ణ మెస్సి ఆల్ స్టార్స్ ఎగ్జిబిషన్ మ్యాచ్ ప్రారంభమైంది. సింగరేణి జట్టు ఎరుపు, తెలుపు రంగు దుస్తులు ధరించగా... మెస్సి స్టార్స్ బృందం అర్జెంటీనా జెర్సీ (నీలి, తెలుపు) రంగు దుస్తులను వేసుకుంది. కాసేపటికే సింగరేణి ఆటగాడు గోల్ కొట్టడంతో స్టేడియం హోరెత్తింది. ఆ కాసేపటికే 7.55 గంటలకు స్టేడియంలోకి మెస్సి ప్రవేశించడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. డ్రెస్సింగ్ రూమ్‌లో మెస్సి, రోడ్రిగో, సువారెజ్ నిలబడి మ్యాచ్‌ను వీక్షిస్తుండగా.. 8 గంటలకు మరో గోల్ సాధించిన సింగరేణి ఆర్ఆర్ జట్టు చివరికి 4-0తో అపర్ణ మెస్సి బృందంపై విజయం సాధించింది. 8.07 గంటలకు రేవంత్‌రెడ్డి ఎరుపు, తెలుపు రంగు జెర్సీ వేసుకుని మైదానంలో అడుగుపెట్టగా... అభిమానులు కేరింతలతో స్వాగతం పలికారు. మైదానంలోకి వస్తూనే వార్మప్ చేసిన రేవంత్.. ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడిని తలపించారు.
మైదానంలో అడుగుపెట్టిన మూడు నిమిషాలకే రేవంత్ గోల్ రాబట్టడంతో స్టేడియంలో ఉత్సాహం అంబరాన్నంటింది. మైదానంలో రేవంత్ ఆడుతోంటే.. వేదికపై నుంచి రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకా గాంధీ పిల్లలు, మెస్సి, రోడ్రిగో, సువారెజ్ వీక్షించారు. 8.11 గంటలకు మెస్సి మైదానంలో అడుగుపెట్టాడు. అప్పటివరకు ఎల్ఈడీ స్క్రీన్ మీదే కనిపించిన ఆయన... ఒక్కసారిగా కళ్ల ముందుకు రావడంతో ప్రేక్షకులు ఉత్సాహంతో ఊగిపోయారు. ప్రతి ఒక్కరూ మునివేళ్లపై నిల్చొని దిగ్గజ ఫుట్‌బాలర్‌ను తనివితీరా చూసుకున్నారు. ఆ తర్వాత అసలు ఆట మొదలైంది. రెండు జట్ల ఆటగాళ్లతో కరచాలనం చేసిన మెస్సి.. రేవంత్‌తో కలిసి ఆట మొదలుపెట్టాడు. రేవంత్‌కు నేరుగా పాస్‌లు అందిస్తూ సందడి చేశాడు. రెండుసార్లు గోల్ పోస్ట్‌లోకి బంతిని తరలించాడు. రేవంత్, మెస్సి, రోడ్రిగో, సువారెజ్ కొద్దిసేపు పాస్‌లు ఇచ్చుకుంటూ సరదాగా గడిపారు. మెస్సి, రోడ్రిగో ఫుట్‌బాల్‌లను గ్యాలరీల్లోకి పంపిస్తూ ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపారు. అనంతరం నిర్వహించిన పెనాల్టీ షూటౌట్లో రెండు జట్లు రెండేసి గోల్స్ చేశాయి. సీఎం రేవంత్‌రెడ్డి సైతం పెనాల్టీ షూటౌట్లో పాల్గొన్నారు. బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపడంతో ఆయనను మెస్సి సహా ఫుట్‌బాల్ ఆటగాళ్లంతా అభినందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

