నేనొక మంత్రిని, ఆరోపణల వస్తే పిలిచి అడిగితే బాగుండేది: మంత్రి ఈటల

కొంతమంది వ్యక్తులను సెలెక్ట్ చేసుకుని, స్ట్రిప్ట్ రాసిచ్చి.. దాని ప్రకారమే మీడియాతో మాట్లాడించారని ఆరోపించారు మంత్రి ఈటల. తాను భూములను కబ్జా చేశానో లేదో ఆయా గ్రామాల సర్పంచ్‌లను ప్రజలను అడిగితే తెలిసిపోతుందన్నారు. ఆ భూములను తానే స్వయంగా కొన్నానని, కొద్దిరోజులు ఇటువంటి ఆరోపణలు నడుస్తాయి తప్ప రోజు నడవవని అన్నారు.
ఓ మంత్రిగా తనపై వచ్చిన ఆరోపణల గురించి పిలిచి అడిగితే బాగుండేదన్నారు ఈటల. ఈ విషయంపై కేటీఆర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించానని, కేటీఆర్ పీఏకు కూడా ఫోన్ చేశానని చెప్పారు. కాని, వాళ్లెవరూ రెస్పాండ్ అవలేదన్నారు. తాను కబ్జాలు చేసి ఉంటే.. నిజ నిర్ధారణ కమిటీలు వేసి నిరూపించుకోవచ్చన్నారు. ఆక్రమించినట్టు తేలితే షెడ్లు మొత్తం కూల్చేయొచ్చని అన్నారు.
కేటీఆర్‌ను సీఎం చేయాలని కోరుకున్న వాళ్లలో తాను కూడా ఒకరన్నారు. పార్టీలో గౌరవం ఉంటే చాలనుకున్నాను తప్పితే సీఎం పదవిపై ఆశపెట్టుకోలేదన్నారు. పార్టీ తరపున ఎవరు సీఎంగా ఉన్నా ఫరక్ లేదని చెప్పుకొచ్చారు. ఒకవేళ తాను తప్పుచేశానని అనుకుంటే.. ముందస్తుగా హెచ్చరించవచ్చని లేదంటే రాజీనామా చేయమని కోరవచ్చని అన్నారు.
ధాన్యం సేకరణ, రేషన్ కార్డులు, పెన్షన్లపై ప్రశ్నించడమే తాను చేసిన తప్పా అని అన్నారు మంత్రి ఈటల. రెండేళ్లుగా కొత్త రేషన్, పెన్షన్ ఇవ్వడం లేదని మాత్రమే ప్రశ్నించానన్నారు. ఏదేమైనా తన గురించి సొంత పార్టీ పత్రికలు, టీవీల్లో వార్తలు రావడమే బాధకలిగించాయని అన్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com