TG: దేవాలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరియాలి

TG: దేవాలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరియాలి
అలయాలను అన్నివిధాల అభివృద్ధి చేయండి... మంత్రి కొండా సురేఖ ఆదేశం

తెలంగాణలోని దేవాలయాలకు ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో అధికారులతో మంత్రి కొండా సురేఖ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.ఆక్రమణకు గురైన దేవాలయ భూములను స్వాధీనం చేసుకునేలా... పకడ్బందీ చర్యలు చేపట్టాలన్న మంత్రి....ధరణిలో నమోదు చేసి దేవాలయం పేరిట పాస్ బుక్ జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

దేవాలయాలు కేవలం భౌతిక నిర్మాణాలు కాదని.. విలువలు, విశ్వాసాలు, సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించే సంపద అని మంత్రి కొండా సురేఖ అన్నారు. దేవాలయాల నిర్వహణను అంతఃకరణ శుద్ధితో చేయాలని అధికారులను కోరారు. ఆక్రమణకు గురైన దేవాలయ భూములను స్వాధీనం చేసుకునేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వివాదాలు త్వరగా పరిష్కారమయ్యేలా సమర్థులైన న్యాయ నిపుణులను పెట్టుకోవాలని తెలిపారు. దేవాలయ భూములు కబ్జా కాకుండా ఉండేందుకు సుమారు 15 వేల ఎకరాలు జియో ట్యాగింగ్ చేసినట్లు అధికారులు వివరించారు. దేవాదాయ శాఖకు చెందిన అన్ని రకాల భూములకు వీలైనంత త్వరగా జియో ట్యాగింగ్ పనులు పూర్తి చేయాలన్న మంత్రి …. ధరణిలో నమోదు చేసి దేవాలయం పేరిట పాస్ బుక్ జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలనిర ఆదేశించారు.

దేవాలయాల్లో కనీస సదుపాయాల కల్పనకు నిరంతర చర్యలు ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. తాగునీరు, టాయిలెట్లు, భక్తులు సేదతీరేందుకు సదుపాయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండరాదని.. పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలన్నారు. ప్రసాదం అమ్మకాలకు వాడే ప్లాస్టిక్ కవర్లు ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలన్న మంత్రి.. పచ్చదనం వెల్లివిరిసేలా దేవాలయ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని వివరించారు. దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు సెక్యూరిటీ సిబ్బందిని, మెటల్ డిటెక్టర్స్, వాకీ టాకీలు వంటి సామాగ్రిని తప్పకుండా సమకూర్చుకోవాలని.. ప్రముఖ దేవాలయాలన్నీ నిరంతరం సీసీ కెమరాల నిఘాలో ఉండాలని సూచించారు. ఆషాఢమాసంలో బోనాల ఉత్సవాల సందర్భంగా మౌలిక సదుపాయాలను నిర్ణీత కాలవ్యవధిలో మెరుగుపరచాలని మంత్రి తెలిపారు. నదీ తీరాల్లో కొలువైన దేవాలయాల్లో జలహారతి, శంఖనాదం వంటి ఆధ్యాత్మిక శోభను పెంచే కార్యక్రమాలను చేపట్టాలని వెల్లడించారు.


Tags

Next Story