Minister KTR : కేంద్రం తీరుకు నిరసనగా ఈ నెల 6న జాతీయ రహదారులపై రాస్తారోకో చేస్తాం : KTR

Minister KTR : కేంద్ర ప్రభుత్వానికి రైతుల పట్ల ఏ మాత్రం దయ లేదన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. వడ్ల కొనుగోలు లక్షలాది మంది రైతుల జీవితాలతో ముడిపడిన సమస్య కావడంతో పెద్ద మనసు చేసుకుని ధాన్యం కొనాలని కేంద్రాన్ని అడిగినట్లు చెప్పారు. ముడి బియ్యం, ఉప్పుడు బియ్యం నిబంధనలు పెట్టొద్దని కేంద్రాన్ని కోరామన్నారు.
అయినప్పటికీ కేంద్రం వడ్లు కొనను అనడంతో యాసంగిలో వరి వేయోద్దని రైతులను కోరామని గుర్తు చేశారు. ఐతే ఇక్కడి బీజేపీ నేతలు రైతులను రెచ్చగొట్టారన్నారు కేటీఆర్. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్, కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలను వినిపించారు కేటీఆర్. సిల్లీ మాటలు వినాలా....ఢిల్లీ బీజేపీ మాటలు వినాలా అంటూ ప్రశ్నించారు.
వడ్లు కొనాలని డిమాండ్ చేసిన ప్రతీసారి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదంటూ స్థానిక బీజేపీ నేతలు రైతులను రెచ్చగొట్టారన్నారు కేటీఆర్. పీయూష్ గోయల్ తెలంగాణ రైతులను అవమానించేలా మాట్లాడారని మండిపడ్డారు. మంత్రులను సైతం అవమానించారన్నారు కేటీఆర్. కేంద్రంలో మూర్ఖపు బీజేపీ ప్రభుత్వం ఉందన్నారు. తెలంగాణ రైతులను అవమానపరిచిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
కేంద్రం తీరుకు నిరసనగా ఎల్లుండి అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు చేపడతామన్నారు కేటీఆర్. ఈ నెల 6న జాతీయ రహాదారులపై రాస్తారోకోలు, నిరసనలు ఉంటాయన్నారు. 8న అన్ని గ్రామ పంచాయతీల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేస్తామన్నారు. అదే రోజు రైతుల ఇళ్లపై నల్ల జెండాలు ఎగరేయాలని పిలుపునిచ్చారు కేటీఆర్. 11న ఢిల్లీలో మంత్రులు, ఎమ్మెల్యేలు సహా అందరూ ప్రజా ప్రతినిధులు నిరసన తెలుపుతామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com