తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై స్పందించిన మంత్రి కేటీఆర్

టాలీవుడ్‌ను కుదేపిస్తున్న డ్రగ్స్ కేసు...తెలంగాణ రాజకీయాల్లోనూ కాక రేపుతోంది.తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా... టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కాంగ్రెస్ నేతల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనపై వచ్చిన డగ్స్ ఆరోపణలపై కేటీఆర్ స్పందించారు. తాను అన్ని డ్రగ్స్ అనాలసిస్ టెస్టులకు సిద్ధమన్న కేటీఆర్.. రాహుల్ గాంధీ సిద్ధమేనా.. అని సవాల్ విసిరారు. డ్రగ్స్ కేసు వ్యవహారంతో నాకేం సంబంధమని కేటీఆర్ ప్రశ్నించారు. ఎవరో ఈడీకి లెటర్ ఇస్తే తనకేం సంబంధమన్నారు.
ఢిల్లీ పార్టీలకు సిల్లి పాలిటిక్స్ మాత్రమే తెలుసని మండిపడ్డారు. కేంద్రహోమంత్రి అమిత్ షా.. రాష్ట్రానికి వచ్చి తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క పథకం గురించైనా చెప్పారా...! అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆదిలాబాద్‌కు ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తామన్న హామీని బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. సాయుధ పోరాట సమరయోధులకు పెన్షన్ విషయంలో కేంద్రం ఎందుకు తాత్సారం చేస్తోందని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిపెట్టిందన్నారు. ప్రతిపక్షాలు పనిలేకనే పాదయాత్ర చేస్తున్నాయని మండిపడ్డారు.
తెలంగాణలో కొత్తగా పుట్టుకొస్తున్న పార్టీలు.. జాతీయ పార్టీలకు కొమ్ము కాస్తున్నాయని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ ఓట్లను చీల్చడం కోసమే కొత్త పార్టీలు వస్తున్నాయన్నారు. ఏదో ఒక జాతీయ పార్టీతో కొమ్ము కాస్తున్నాయని విమర్శించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో కేసీఆర్‌ను పొగిడి ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రానికి నవోదయ విద్యాలయాలు రాకపోతే.. కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరని అడిగారు కేటీఆర్. షర్మిల కూడా అలానే వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com