Marri Rajasekhar Reddy: వ్యాపారాల్లో ఉన్నందున ఐటీ దాడులు సహజమే: మల్లారెడ్డి అల్లుడు

Marri Rajasekhar Reddy:  వ్యాపారాల్లో ఉన్నందున ఐటీ దాడులు సహజమే: మల్లారెడ్డి అల్లుడు
Marri Rajasekhar Reddy: ఐటీ రైడ్స్ నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి టర్కీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు.

Marri Rajasekhar Reddy: ఐటీ రైడ్స్ నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి టర్కీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఐటీ రైడ్స్ పై స్పందించిన రాజశేఖర్ రెడ్డి... తనకు అధికారుల నుంచి ఎలాంటి ఫోన్ రాలేదన్నారు. మీడియా ద్వారానే తనకు ఐటీ దాడుల విషయం తెలిసిందన్నారు.



తాము వ్యాపారాల్లో ఉన్నందున ఐటీ దాడులు సహజమేనన్నారు. గతంలో 1995, 2008లో ఐటీ సోదాలు జరిగాయని.. తాజా మళ్లీ ఇప్పుడు జరుగుతున్నాయన్నారు. ఇక ఐటీ సోదాల్లో భాగంగా ఎలాంటి విచారణను ఎదుర్కొనేందుకైనా తాను సిద్ధంగా ఉన్నాని రాజశేఖర్ రెడ్డి అన్నారు.


మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ శాఖ నజర్ వేసింది. ఇందులో భాగంగానే రెండు రోజుల పాటు మంత్రి మల్లారెడ్డి నివాసాలు, విద్యాసంస్థలు, కార్యాలయాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇక ఈ సోదాల్లో భారీ నగదుతోపాటు, పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.



సుమారు 4వందల మంది అధికారులు 65 బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారు. మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలతో పాటు ఆయన సన్నిహితులు, సమీప బంధువుల ఇళ్లలోనూ అధికారులు ముమ్మరంగా సోదాలు చేశారు. ఈ సోదాల్లో సుమారు వంద కోట్ల నగదు సీజ్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది.



ఇక సోదాల అనంతరం విచారణకు రావాలని మంత్రి మల్లారెడ్డికి సమన్లు జారీ చేశారు.. ఐటీ అధికారులు. ఐటీ అధికారుల సమన్ల నేపథ్యంలో మల్లారెడ్డి ఈ రోజు ఐటీశాఖ కార్యాలయంలో విచారణకు హాజరయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.


మరోవైపు మంత్రి మెడికల్ కళాశాలలో వంద కోట్లు దొరికాయనే ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. దీనికి బలం చేకూరే విధంగా మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. వంద కోట్లు దొరికాయని అధికారులు తమతో సంతకం చేయించుకున్నారని మంత్రి చెప్పడంతో... ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.



నిజంగానే మంత్రి మల్లారెడ్డి కళాశాలల్లో భారీగా నగదు పట్టబడిందని వాదనలు వినిపిస్తున్నాయి. అక్రమాస్తుల చిట్టాను మొత్తం అధికారులు బయటకు తీసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో మంత్రి మల్లారెడ్డి మెడకు ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది.



విచారణలో భాగంగా మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డిని కూడా ఐటీ అధికారుల పిలిచారు. ఐటీ అధికారుల పిలుపు అందగానే ప్రీతి రెడ్డి.. ఓ బ్యాగ్‌తో అధికారుల ఎదుట హాజరయ్యారు. అయితే ఆ బ్యాగ్‌లో ఏముంది అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. అలాగే మల్లారెడ్డి మనవరాలు శ్రేయను బ్యాంక్‌కి తీసుకెళ్లడం కూడా చర్చనీయాంశంగా మారింది.



మరోవైపు శంషాబాద్ మండలం కాచారంలోని వర్థమాన్ ఇంజనీరింగ్ కళాశాలలోనూ ఐటీ సోదాలు జరిగాయి. మూడు కార్లలో వచ్చిన ఐటీ అధికారులు కళాశాలలో విస్తృతంగా తనిఖీలు చేశారు. కళాశాల విద్యార్థులను తప్పా మిగతావారిని లోనికి అనుమతించ లేదు. ఇక వర్థమాన్ కళాశాలకు మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు.



మరోవైపు మల్లారెడ్డి బంధువు సంతోష్‌ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు విస్తృతంగా సోదాలు జరిపారు. ఆయన ఇంట్లో ఏకంగా 4కోట్ల రూపాయలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. పలు డాక్యుమెంట్లను రెట్రివ్ చేశారు. వాటిలో ఏముందన్నది సస్పెన్స్‌గా మారింది.



సంతోష్‌ రెడ్డి.. మల్లారెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఫ్యామిలీకి సంబంధించిన రియల్‌ ఎస్టేట్‌ భూముల కొనుగోళ్ల వ్యవహారాలను ఆయనే చూస్తారు. మల్లారెడ్డి కాలేజీలు, ఆర్థిక వ్యవహారాల్లోనూ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.



మల్లారెడ్డి యూనివర్శిటీ వ్యవహారాలు చూసే ప్రవీణ్‌ ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే సోదాల సమయంలో ప్రవీణ్ అస్వస్థతతో ఆస్ప్రత్రిలో అడ్మిట్ అయ్యారు.



ట్రీట్‌మెంట్‌ అనంతరం ఐటీ అధికారులు ప్రవీణ్ ను ఇంటికి తీసుకెళ్లి పలు పత్రాలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మల్లారెడ్డి యూనివర్శిటీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను ప్రవీణ్‌ రెడ్డే చూస్తారు. ఇక ఐటీ అధికారుల ముప్పేట దాడితో మంత్రి మల్లారెడ్డి ఉక్కిరిబిక్కిరి అయినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story