TG: ఆటమ్ బాంబ్ పేలబోతోంది: మంత్రి పొంగులేటి

TG: ఆటమ్ బాంబ్ పేలబోతోంది: మంత్రి పొంగులేటి
X
మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు... ఎంత పెద్దవాళ్లకైనా చట్టం చుట్టం కాదన్న మంత్రి

తెలంగాణలో త్వరలోనే ఆటంబాంబ్ పేలుతుందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వాళ్లకు నాటుబాంబు కాదు.. లక్ష్మీబాంబు కాదు.. ఆటమ్‌బాంబు పేలబోతోందంటూ హెచ్చరించారు. జనం సొమ్మును అక్రమ మార్గంలో విదేశాలకు పంపారని... ఎంత పెద్దవాళ్లకైనా చట్టం చుట్టం కాదన్నారు. రూ.55 కోట్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాయో తేలుస్తామన్నారు. తప్పు చేయని వాళ్లు ఉలిక్కి పడొద్దన్నారు. 'తప్పుచేసిన వారిని చట్టం వదిలి పెట్టదు. నేను కానీ.. ముఖ్యమంత్రి కానీ ఎవరి పేరు ప్రకటించలేదు. తప్పు చేయకపోతే మీకు అంత ఉలిక్కిపాటు ఎందుకు?' అని పొంగులేటి ప్రశ్నించారు. 'మీ ఆస్తులు పెంచుకోవడం కోసం పేదల సొమ్ము విదేశాలకు పంచిన వారిని చట్టం వదలదు. చట్టం తన పని తాను చేసుకుంటది' అని తెలిపారు. 'రూ.55 కోట్ల పేదల సొమ్ము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాయో త్వరలోనే బయట పడతాయి. అవి ఎవరు తీసుకున్నారో బయట పెడతాం' అని ప్రకటించారు.

విదేశీ పర్యటనలోనే సంచలన వ్యాఖ్యలు

దక్షిణ కొరియా పర్యటన సమయంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ బాంబు పేలుడు ప్రకటన చేశారు. దీపావళికి బీఆర్ఎస్‌పై బాంబులు పేలుస్తామని అన్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అగ్రనేతల అరెస్టులు ఉంటాయని అంతా భావించారు. ముఖ్యంగా జన్వాడ ఫాంహౌస్ కేసు, ఫార్ములా ఈ కార్ రేస్ ఆరోపణల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే అంతా భావించారు. అయితే, అలాంటిదేమీ జరగలేదు. అనంతరం సచివాలయంలో ఇటీవల చిట్ చాట్ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఇదే అంశాన్ని ఆయన వద్ద ప్రస్తావించారు. 'దీపావళి అయిపోయింది. అయినా బాంబులు పేలలేదేంటి సార్' అంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే 'నన్ను ర్యాగింగ్ చేస్తున్నారా?' అంటూ జర్నలిస్టులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి అలాంటి ఇలాంటి బాంబు ఉండదని.. ఆటం బాంబు పేలుతుందని ప్రకటించారు.

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా..

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి అన్నారు. రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పులున్నా.. సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపడం లేదని నిర్విరామంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యానికి 11 నెలలు నిండాయని అన్నారు. రైతులకు సంబంధించిన పంట రుణమాఫీని డిసెంబర్ లోపు పూర్తి చేస్తామని మరోసారి గడువు పొడిగించారు.

Tags

Next Story