Minister Ponnam: సిద్ధిపేట సబ్ స్టేషన్ పేలుడులో ప్రాణ నష్టం లేదు గానీ
సిద్దిపేటలోని 220 కేవీ సబ్ స్టేషన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సబ్‌ష్టేన్‌లో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. పీటీఆర్ పేలిపోవడం వల్లే సబ్ స్టేషన్‌లో ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. మూడు అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పామన్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఈ 220 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ పేలుడు రాజకీయానికి కేంద్రబిందువుగా నిలిచింది. కాంగ్రెస్(Congress) ప్రభుత్వానికి సబ్ స్టేషన్ల నిర్వహణ కూడా సరిగా రావడం లేదని బీఆర్ఎస్విమర్శిస్తే.. గత ప్రభుత్వంలో చేపట్టిన నాసి రకం పనుల వల్లే ప్రమాదం జరిగిందని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది.
సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తా వద్ద ఉన్న 220 కేవీ సబ్ స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్లు పేలటంతో.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఒక దాని తర్వాత ఒకటి పేలుతుండటంతో.. భారీ ఎత్తున అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే.. సంఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ ఇంజిన్లు మంటలు అర్పేందుకు ప్రయత్నించాయి. మంటలు అదుపులోకి రాకపోవటంతో.. పక్కనున్న మండలాల నుంచి మరో మూడు ఫైర్ ఇంజిన్లను కూడా రప్పించారు. ట్రాన్స్ ఫార్మర్లు పేలిన శబ్దాలతో చుట్టుపక్కల స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ అగ్నిప్రమాదంతో.. సిద్దిపేట మొత్తం విద్యుత్ నిలిచిపోవడంతో పట్టణమంతా అంధకారం అలుముకుంది.అయితే ఈ ఘటనకు రాజకీయం రంగు పులుముకుంది. విద్యుత్ సరఫరా నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ప్లాప్ అయ్యిందని బీఆర్ఎస్ శ్రేణులు విమర్శించాయి. కాంగ్రెస్ ను ఓడించిన సిద్ధిపేట ప్రజలను చీకట్లో మగ్గపెట్టి ఆ పార్టీ పగ తీర్చుకుంటోందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. సిద్దిపేట పట్టణంతోపాటు 5 మండలలాకు సరఫరా నిలిచిపోయిందంటూ మండిపడుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com