కరెంట్ షాక్‌తో ఐదుగురు మృతి.. బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ జిల్లాలో కరెంట్ షాక్‌తో ఐదుగురు మృతి చెందడంతో విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో అమనగల్లులో నలుగురు.. మరిపెడలో ఒకరు నిన్న దుర్మరణం పాలయ్యారు. అమనగల్లులో రెండు కుటుంబాలకు చెందిన నలుగురు చనిపోయారు. ఒకర్ని కాపాడే క్రమంలో మరొకరు ఇలా ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాల సభ్యుల్ని మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రిలో పరామర్శించారు.
విద్యుత్ కనెక్షన్ల పొరపాటు వల్ల ఈ ప్రమాదం జరగడంతో ట్రాన్స్‌కో తరపు నుంచి ఒక్కో వ్యక్తికి 5 లక్షల రూపాయల చొప్పున కుటుంబానికి పది లక్షలు పరిహారం అందిస్తామన్నారు. అలాగే.. చనిపోయిన వారు రైతులు కావడంతో ముఖ్యమంత్రి తీసుకొచ్చిన రైతు బీమా ద్వారా ఒక్కో కుటుంబానికి మరో 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందేలా చూస్తామన్నారు.
మరిపెడలో కూడా మరొకరు విద్యుత్ షాక్ కు గురై చనిపోవడం చాలా బాధాకరమన్నారు. కరెంటు షాక్ వల్ల ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఆ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఈ ప్రమాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com