Huzurabad By Elections : 20 ఏళ్లలో TRS అనేక ఆటుపోట్లను చూసింది : మంత్రి కేటీఆర్

Huzurabad By Elections : 20 ఏళ్లలో TRS అనేక ఆటుపోట్లను చూసింది : మంత్రి కేటీఆర్
హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలపై స్పందించారు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్. 20 ఏళ్లలో TRS ఎన్నో ఆటుపోట్లను చూసిందంటూ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్.

హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలపై స్పందించారు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్. 20 ఏళ్లలో TRS ఎన్నో ఆటుపోట్లను చూసిందంటూ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. ఈ ఉప ఎన్నిక ఫలితంతో పెద్దగా వచ్చే మార్పులేం ఉండవన్నారు. స్ఫూర్తిదాయకంగా పోరాడిన గెల్లు శ్రీనివాస్ కు అభినందనలు తెలిపారు. భవిష్యత్ పోరాటాలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో శ్రమించిన మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్లకు కృతజ్ఞతలు చెప్పారు.

ప్రచారంలో అన్ని తానై వ్యవహరించిన మంత్రి హరీష్ రావు కూడా హుజురాబాద్ ఫలితంపై స్పందించారు. ప్రజా తీర్పును శిరసా వహిస్తామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్,బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేశాయన్నారు హరీష్. ఒక్క ఓటమితో టీఆర్ఎస్ కుంగిపోదన్నారు. ఓడినా, గెలిచినా టీఆర్ఎస్ ప్రజల పక్షాన పని చేస్తుందని చెప్పారు. టీఆర్ఎస్ కు ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. గతంలో కంటే TRSకు ఓట్లేమి తగ్గలేదన్నారు.

హుజురాబాద్ లో తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు చెప్పారు TRS అభ్యర్థి గెల్లు శ్రీనివాస్. ఓటమికి బాధ్యత తీసుకుంటున్నట్లు చెప్పారు. విజయం సాధించిన ఈటల రాజేందర్ కు శుభాకాంక్షలు చెప్పారు. తన కోసం ప్రచారం చేసిన మంత్రులకు అభినందనలు తెలియజేశారు. హుజురాబాద్ ప్రజలకు అందుబాటులో ఉంటానని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు.

ఇక హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ ను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఎలాంటి ప్రలోభాలకు లోంగబోమని ప్రజలు నిరూపించారన్నారు. ఇది హుజురాబాద్ ప్రజల విజయమన్నారు కిషన్ రెడ్డి. ఈ ఉప ఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైందన్న కిషన్ రెడ్డి...అంతిమంగా ధర్మం, నిజాయతీ గెలిచిందన్నారు.

ఈటల గెలుపు బీజేపీ గెలుపని.. బీజేపీ గెలుపు ఈటల గెలుపన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. దళిత బంధు అమలు చేసినా ప్రజలు కేసీఆర్ ను నమ్మలేదన్నారు. తెలంగాణలో ప్రజలు అధికార మార్పిడిని కోరుకుంటున్నారని హుజురాబాద్ ఫలితం నిరూపించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రజలు విశ్వాసం కోల్పోయారని చెప్పారు. బెదిరింపు, అబద్ధపు హామీలతో గెలవలేమని ఇప్పటికైనా టీఆర్ఎస్ గుర్తించాలన్నారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలపై సమీక్షించుకుంటామన్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్కం ఠాగూర్. పార్టీ వెనకబడటానికి గల కారణాలపై రివ్యూ చేస్తామన్నారు. బీజేపీకి సహకరించామన్న TRS ప్రచారం వట్టిదేనన్నారు ఠాగూర్.

హుజురాబాద్ ఫలితంపై స్పందించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఓటమి బాధ్యతను తానూ తీసుకుంటున్నానని చెప్పారు. ఈ ఎన్నికలు ప్రత్యేక పరిస్థితుల్లో జరిగాయన్న రేవంత్ రెడ్డి....ఫలితాలు కాంగ్రెస్ భవిష్యత్తును నిర్ణయించవన్నారు. హుజురాబాద్ లోని ప్రతి ఇంటి తలుపు తట్టామని...ప్రజలకు మరింత దగ్గరయ్యామన్నారు. సమస్యల పరిష్కారానికి పోరాడతామన్నారు. గెలిస్తే పొంగిపోయేది లేదు..ఓడితే కుంగిపోయేది లేదన్నారు.

ఇక హుజురాబాద్ లో గెలవడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ లోని పార్టీ ఆఫీసు దగ్గర పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. బండి సంజయ్ ని భుజాల మీద ఎత్తుకున్నారు. డప్పు చప్పుళ్లకు డ్యాన్సులు చేస్తు ఎంజాయ్ చేశారు. పెద్ద ఎత్తున టపాసులు కాల్చారు. స్వీట్లు తినిపించుకున్నారు.

బర్కత్ పురాలోనూ బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. పెద్ద ఎత్తున టపాసులు కాల్చారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని బీజేపీ ఆఫీసు దగ్గర సందడి కనిపించింది. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులర్పించారు.

Tags

Read MoreRead Less
Next Story