హైదరాబాద్‌లో పలు లింకు రోడ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్..!

హైదరాబాద్‌లో పలు లింకు రోడ్లను ప్రారంభించారు మంత్రి KTR. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని 3 లింక్ రోడ్లను ప్రారంభించడం ద్వారా.. ప్రధాన రహదారులకు కనెక్టివిటీ పెరుగుతోంది. ఈ తరహా రోడ్ల వల్ల ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడంతోపాటు, ప్రయాణ దూరం కూడా తగ్గుతోంది. నగరంలో మొత్తం 126 కిలోమీటర్ల రోడ్ల విస్తరణలో భాగంగా 135 లింకు రోడ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన పనులు అన్ని చోట్లా వేగంగా జరుగుతున్నాయి. మొదటి దశలో భాగంగా 37 మిస్సింగ్ రోడ్లను 313 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు పరిపాలన అనుమతులు కూడా ఇచ్చారు. ఇక ఇవాళ 27 కోట్ల 43 లక్షల రూపాయల ఖర్చుతో పూర్తయిన లింక్ రోడ్‌లను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
హైదరాబాద్ అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని.. ఆ అవసరాలకు తగ్గట్టు రహదారుల విస్తరణ ప్రణాళిక కూడా అవసరం అని KTR అన్నారు. లింక్ రోడ్ల వల్ల ప్రధాన రహదారులపై ట్రాఫిక్ తగ్గితే ప్రయాణ సమయం కూడా ఆదాఅవుతుందని చెప్పారు. ఇప్పటికి 16 లింక్ రోడ్లు పూర్తయ్యాయని మిగతా వాటి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయన్నారు. శేరిలింగంపల్లిలో జనసాంద్రత ఎక్కువ కాబట్టి అక్కడ ట్రాఫిక్ సమస్యలకు చెక్‌పెట్టేలా లింక్ రోడ్ల పనులు, విస్తరణ పనులు చేపట్టామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com