Hyderabad: రూ.15 కోట్ల అప్పులు చేసిన మిషన్ భగీరథ ఏఈ |
ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై రూ. 15 కోట్లు అప్పు చేసి దేశం విడిచిపారిపోయేందుకు ప్రయత్నించిన మిషన్ భగీరథ ఏఈ రాహుల్ నిన్న ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. కీసర మండలం మిషన్ భగీరథ ఏఈగా పనిచేసిన రాహుల్ రమ్మీలాంటి ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసయ్యాడు. అందిన చోటల్లా భారీగా అప్పులు చేశాడు. పనులు ఇప్పిస్తానని కాంట్రాక్టర్లను నమ్మించి వారి నుంచి పెద్దమొత్తంలో డబ్బులు తీసుకున్నాడు. విషయం కాస్తా ఉన్నతాధికారులకు చేరడంతో ఆరు నెలల క్రితం సస్పెండ్ చేసినప్పటికీ విషయం రహస్యంగానే ఉండిపోయింది. రాహుల్‌కు సహకరించిన అదే శాఖలోని ఉద్యోగిపైనా అధికారులు వేటేశారు.
37 మంది నుంచి రూ. 15 కోట్లకుపైగా అప్పు చేసిన రాహుల్ వాటిని తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కీసర పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాహుల్ పరారీలో ఉన్నట్టు గుర్తించి లుక్ అవుట్ నోటీసు జారీచేశారు. ఈ క్రమంలో నిన్న ఢిల్లీ నుంచి విదేశాలకు చెక్కేసే ప్రయత్నంలో ఉన్న ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రే కీసర పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ ప్రారంభించారు. కాగా, రాహుల్ భార్య, తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ ఉద్యోగులే. రాహుల్ చేసిన అప్పులను వారు తీరుస్తామని హామీ ఇచ్చినా ఆ తర్వాత పట్టించుకోలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com