KAVITHA: కవితకు 'క్లీన్ చిట్'పై భిన్నస్వరాలు

ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితకు ఊరట లభించడంపై రాజకీయ దుమారం రేగుతోంది. సీబీఐ కేసు వీగిపోవడంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందిస్తూ.. కోర్టు కేవలం సాక్ష్యాలు లేవని మాత్రమే చెప్పిందని, ఇది 'క్లీన్ చిట్' కాదని స్పష్టం చేశారు. బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ఎన్నటికీ పొత్తు ఉండదని ఆయన తేల్చిచెప్పారు. మరోవైపు, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి దీనిని బీజేపీ ఆడుతున్న రాజకీయ డ్రామాగా అభివర్ణించారు. అవసరాలకు అనుగుణంగా బీజేపీ తన మిత్రులను, శత్రువులను మార్చుకుంటుందని విమర్శించారు. కవితకు ఊరట వెనుక రాజకీయ ఒప్పందాలు ఉన్నాయనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలం సాగిన ఈ విచారణలో కోర్టు తాజా నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. కవితకు ఊరట లభించడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటుండగా, ప్రత్యర్థి పార్టీలు విమర్శల పదును పెంచాయి.రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ తీర్పు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ఏ విధంగా మారుస్తుందనే చర్చ మొదలైంది.
45 రోజులపాటు సుదీర్ఘ విచారణ అనంతరం ప్రత్యేక కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారీ చార్జిషీట్లలో అనేక లోపాలు ఉన్నాయని, సాక్షుల వాంగ్మూలాలు ఆరోపణలకు మద్దతు ఇవ్వలేదని కోర్టు అభిప్రాయపడింది. ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లేకుండానే నిందితులను ఇరికించారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ముఖ్యంగా కేజ్రీవాల్‌ను ఈ కేసులో లాగడంపై కోర్టు తీవ్రంగా స్పందించింది. దర్యాప్తు సంస్థలపై కోర్టు చేసిన వ్యాఖ్యలు విశేష ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కేసు నిస్పక్షపాతంగా విచారణ జరగాలంటే దర్యాప్తు కూడా అదే స్థాయిలో నిష్పాక్షికంగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. ఆరోపణలను నిరూపించేందుకు సరైన ఆధారాలు సమర్పించడంలో సీబీఐ విఫలమైందని పేర్కొంటూ మొత్తం కేసును కొట్టివేసింది. ఈ కేసులో 23 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారి తీసింది. ఒకవైపు ఆప్ పార్టీ దీన్ని తమపై జరిగిన రాజకీయ ప్రతీకారానికి ముగింపు అని పేర్కొంటుండగా, మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు మళ్లీ ముందుకు వచ్చాయి. అదే సమయంలో, ఈ కేసులో అరెస్టులు, జైలు జీవితం కారణంగా నిందితులకు జరిగిన నష్టం పూడ్చలేనిదని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో పరువు నష్టం దావాలు వేయబడే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది.
కల్వకుంట్ల కవితకు సీబీఐ బిగ్ షాక్
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించిన కొద్ది గంటల్లోనే సీబీఐ షాక్ ఇచ్చింది. నిందితులందరినీ విడుదల చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మద్యం విధానం రూపకల్పనలో అక్రమాలు జరిగాయని, కవిత పాత్రపై కీలక ఆధారాలు ఉన్నాయని సీబీఐ వాదిస్తోంది. ఈ అప్పీల్‌తో కవితకు మళ్లీ చిక్కులు మొదలయ్యే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
