Jaggareddy : సీఎం కేసీఆర్ థర్డ్‌ఫ్రంట్, మహారాష్ట్ర పర్యటనపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

Jaggareddy : సీఎం కేసీఆర్ థర్డ్‌ఫ్రంట్‌పైనా.. మహారాష్ట్ర పర్యటనపైనా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అనుకూల ముద్ర నుంచి బయటపడేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌లను కలిసేందుకు వెళ్లడం రాజకీయాల్లో భాగమే అన్నారు. స్టాలిన్, ఉద్దవ్, దేవెగౌడ, మమతా బెనర్జీ అందరూ కాంగ్రెస్ దగ్గరివారే అన్న జగ్గారెడ్డి.. ఏ కూటమి అయినా కాంగ్రెస్‌తో కలవాల్సందే అని తేల్చి చెప్పారు. బీజేపీతో సంబంధంలేని రాజకీయ పార్టీలనే కేసీఆర్ కలుస్తున్నారని.. యూపీఏ కూటమి చీల్చేందుకు కేసీఆర్ ప్రయత్నం చేసినా ఉపయోగం ఉండదన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్.. బీజేపీ అనుకూల సీఎం అంటూ రైతు ఉద్యమ నాయకులు రాకేష్ తికాయత్ చేసిన వ్యాఖ్యలను జగ్గారెడ్డి గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామాను వాయిదా వేసుకుంటున్నట్లు ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టంచేశారు. 15 రోజులు వేచి చూసి రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సమస్య మూలాలను తెలుసుకోవడం లేదన్నారు. టీ కప్పులో తుఫాన్ అనడంలో తప్పు లేదు కానీ.. అసలు సమస్య ఎందుకొచ్చిందో ఆలోచించడం లేదని మండిపడ్డారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీల అపాయింట్మెంట్ ఇప్పిస్తే వారికే నా బాధలు చెప్పుకుంటానని చెప్పారు. ఒకవేళ వారి అపాయింట్‌మెంట్ దొరకకపోతే నా రాజీనామాకు కట్టుబడి ఉంటానని తేల్చి చెప్పారు జగ్గారెడ్డి.
తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను తమిళనాడు రాజకీయాలతో పోల్చిన జగ్గారెడ్డి.. రేవంత్‌రెడ్డి అనుచరులు చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని.. తాను భయంతో పార్టీని వీడటం లేదన్నారు. కాంగ్రెస్‌లో తాను ఒంటరి వాడినయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరినో నిందించడం కంటే తానే తప్పుకుంటే బాగుంటుందనే కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com