తెలంగాణలో ఆసక్తిగా మారిన ఎమ్మెల్సీ ఎన్నికలు..

తెలంగాణలో ఆసక్తిగా మారిన ఎమ్మెల్సీ ఎన్నికలు..
X
మరో విశేషమేమిటంటే...ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జర్నలిస్టులు సైతం పోటీ చేస్తుండటం

పట్టభద్రుల కోటాలో శాసనమండలిలో అడుగుపెట్టేందుకు రాజకీయ పార్టీలనేతలతో పాటు స్వతంత్రలు సైతం తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి గెలుపొందడంతో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌. మరోవైపు టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఇంటి పార్టీ అధ్యక్షుడు సుధాకర్ సైతం పోటీలో ఉన్నామని ప్రకటించడంతో... ఈ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. వీరితో పాటు మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్, దిలీప్‌, హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ బరిలో నిలుస్తామని ప్రకటించారు. తీన్మార్‌ మల్లన్న వంటి జర్నలిస్ట్‌లు సైతం పోటీ చేస్తుండటంతో ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తిగా మారాయి.

2021 మార్చి నెలలో హైదరాబాద్‌-రంగారెడ్డి-ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్గొండ-వరంగల్- ఖమ్మం స్థానాలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ కోటాలో ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీజేపి రామచంద్రరావు పదవీకాలం ముగిస్తోంది. దీంతో... ఈ రెండు స్థానాల ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించింది ఎన్నికల సంఘం.ఓటర్ల నమోదు ప్రక్రియను షురూ చేసింది. ప్రస్తుతం ఓటర్ల నమోదు ప్రక్రియలో తలమునకలయ్యారు ఎన్నికల అధికారులు. ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీచేసింది. పట్టభద్రుల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకోవాలనుకునే వారు ఖచ్చితంగా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అర్హులైన వారు అక్టోబర్‌ 1 నుంచి ఓటు నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇవాల్టి నుంచి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఓటరు నమోదుకు నవంబర్‌ 11 వరకు వరకు గడువు ఉంది. డిసెంబర్‌ 1న ఓటరు ముసాయిదాను ప్రకటిస్తారు. తుది ఓటర్లు జాబితాను జనవరి 18 ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఓటరు నమోదుపై ఆయా జిల్లాల్లో అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నాయి.

వాస్తవానికి... పట్టబద్రులు, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలను రాజకీయపార్టీలు సీరియస్‌గా తీసుకోవు. కానీ ఈ సారి పరిస్థితి మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా జీవన్ రెడ్డి... కరీంనగర్ -నిజామాబాద్ - ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలలో ఆశలు చిగురించాయి. జీవన్ రెడ్డి... గెలవడంతో టిఆర్ఎస్ పార్టీ కాస్త ఇరకాటంలో పడింది. అందుకే... ఈసారి ఈ రెండు చోట్ల గెలవాలని మంత్రి కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. ప్రతి మండలంలో సమన్వయకర్తల నియమించి... పట్టబద్రుల నమోదులో పకడ్బందీగా వ్యవహరించేలా దిశానిర్దేశం చేస్తున్నారు. నల్గొండ- ఖమ్మం - వరంగల్ నుంచి మరోసారి పల్లా రాజేశ్వర్‌రెడ్డి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ బరిలో మేయర్ రామ్మోహన్, మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి పేరు వినిపిస్తున్నాయి.

అటు... టీజేఎస్ నేత కోదండరామ్ సైతం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆసక్తి చూపుతున్నారు. ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన తనను.... గ్రాడ్యుయేట్లు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నారాయన. తనకు మద్దతు ఇవ్వాలని ఇప్పటికే కాంగ్రెస్, టీడీపితో పాటు ఇతర పార్టీలను కోరారు. మరోవైపు ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ సైతం పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దిగుతామని ప్రకటించారు. దీంతో నల్గొండ - ఖమ్మం -వరంగల్ పట్టభద్రుల ఎన్నిక ఆసక్తికరంగా మారింది. అటు కాంగ్రెస్ నుంచి మానవతారాయ్, ఇందిరా శోభన్, శ్రావణ్ తదితరులు సైతం ఆసక్తి చూపుతున్నారు. అయితే కోదండరామ్‌ కు మద్దతు ఇచ్చే విషయంలో... పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్లు చిన్నా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వంశీ, సంపత్‌లు సైతం ఆసక్తి చూపుతున్నారు. ఈసారి ఎలాగైనా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి అడుగు పెట్టాలని భావిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఆర్‌ఎల్డీనేత దిలీప్‌ మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. అటు.. రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రొఫెసర్ నాగేశ్వర్ మళ్లీ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. కోదండరాం, చెరుకు సుధాకర్, నాగేశ్వర్, దిలీప్ తదితరులు పోటీ చేస్తుండటంతో... ఈ ఎన్నికలు ఆసక్తిగా మారాయి.

మరో విశేషమేమిటంటే...ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జర్నలిస్టులు సైతం పోటీ చేస్తుండటం. తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు పాత్రికేయులు సైతం బరిలో దిగుతున్నారు. ముఖ్యంగా నల్గొండ- ఖమ్మం - వరంగల్ నుంచి జర్నలిస్టు పీవీ శ్రీనివాస్, తీన్మార్ మల్లన్న, రాణి రుద్రమ, జయసారథి బరిలో నిలుస్తున్నారు. తీన్మార్ మల్లన్న గతంలో పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి తనను కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకంతో తీన్మార్ మల్లన్న బరిలోకి దిగుతున్నారు. ఇక రాణిరుద్రమ సైతం ఎన్నికల బరిలో సీపీఎం మద్దతు ఇస్తారని అంటున్నారు. మొత్తానికి హేమాహేమీలంతా బరిలో ఉండడంతో పట్టభద్రుల ఎన్నికలు.. అధికార టీఆర్‌ఎస్‌కు, విపక్ష కాంగ్రెస్‌కు, కోదండరామ్‌కు ప్రతిష్టాత్మకంగా మారాయి.

Tags

Next Story