TS: ఎమ్మెల్సీ, నామినేటెడ్‌ పదవులపై నేడు స్పష్టత

TS: ఎమ్మెల్సీ, నామినేటెడ్‌ పదవులపై నేడు స్పష్టత
పార్టీ అగ్రనేతలతో సమావేశమై చర్చించనున్న రేవంత్‌రెడ్డి.... నామినేటెడ్‌ ఛైర్మన్లపై నేడు తుది నిర్ణయం

తెలంగాణలో నాలుగు MLC స్థానాల్లో అభ్యర్థులు, నామినేటెడ్ పదవులకు ఛైర్మన్ల ఎంపిక ఇవాళ కొలిక్కి రానుంది. ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ అగ్రనేతలతో సమావేశమై చర్చించనున్నారు. రేవంత్‌ రెడ్డి, తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీప దాస్‌మున్షీ, సునీల్ కనుగోలుతో కలిసి KC వేణుగోపాల్‌తో సమావేశమై ఎమ్మెల్సీ అభ్యర్థులు, నామినేటెడ్ చైర్మన్ల పై తుది నిర్ణయం తీసుకుంటారు. కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్‌ పదవుల భర్తీ అంశం తుదిదశకు చేరింది. పేర్లు ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. గవర్నర్ కోట కింద రెండు, ఎమ్మెల్యే కోటా కింద రెండు ఎమ్మెల్సీలు భర్తీ చేసేందుకు కసరత్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది.


రేవంత్‌, దీపా దాస్‌మున్షీ, సునీల్ కనుగోలు ఇప్పటికే ఒక దఫా సమావేశమై MLC అభ్యర్థుల ఎంపికపై చర్చించినట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల సమయంలో టికెట్లు ఇవ్వలేని నాయకులకు ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా తెలంగాణ ఇన్‌ఛార్జి కార్యదర్శులు ఓ జాబితాను రేవంత్ రెడ్డి, దీప దాస్‌మున్షి, సునీల్ కొనుగోలు ఇచ్చినట్లు సమాచారం. దీనిపై చర్చించిన ఈ ముగ్గురు.. నిర్ణయానికి వచ్చిన పేర్లపై ఇవాళ KC వేణు గోపాల్‌తో సమాలోచనలు జరపనున్నారు. అనంతరం తుది జాబితాపై అధిష్ఠానంతో ఆమోదముద్ర వేయించి ప్రకటించే అవకాశం ఉంది. నాలుగు MLCల్లో ఒకటి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంకు ఇవ్వాల్సి ఉండగా... మిగిలిన మూడు BC, మైనార్టి, OCకి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. MLA కోటా ఎంపిక పూర్తికాగానే.. ఈ నెల 18లోపు సంబంధిత అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సి ఉంది.

శాసనసభలో ఉన్న బలాబలాలను పరిశీలనలోకి తీసుకున్నట్లయితే MLA కోటా రెండు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. నామినేటెడ్ పదవులు భర్తీ విషయంలోనూ ప్రధాన పదవులను అర్హులైన నాయకులకు కట్టబెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులతో కలిసి సమాలోచనలు చేసిన తర్వాత జాబితా ఇప్పటికే సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. అదే జాబితాను కాంగ్రెస్ పెద్దలతో చర్చించి తుది నిర్ణయం తీసుకొని ప్రకటించే అవకాశం ఉంది. RTC, పౌరసరఫరాల, మైనింగ్ ఆబ్కారీ, T.S.I.I.C, ఆగ్రో, రైతుబంధు సమితి, విత్తనాభివృద్ధి సంస్థ, మార్క్‌ఫెడ్, వేర్‌హౌసింగ్ కార్పొరేషన్, మత్స్య కార్పొరేషన్, వెనుకబడిన తరగతుల కార్పొరేషన్, తదితర ముఖ్యమైన 20కి పైగా కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో రాష్ట్రస్థాయిలో MLA టికెట్లు త్యాగం చేసిన, పార్టీ గెలుపునకు కృషి చేసిన నాయకులకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ నామినేట్ పదవులు సంబంధించి కూడా సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మణిపూర్ నుంచి రేపు ప్రారంభం కానున్న రాహుల్‌గాంధీ భారత్ న్యాయ్‌ యాత్ర కార్యక్రమంలో పాల్గొంటారు.

Tags

Read MoreRead Less
Next Story