MLC: కొనసాగుతున్న ఎమ్మెల్సీ పోలింగ్‌

MLC: కొనసాగుతున్న ఎమ్మెల్సీ పోలింగ్‌
X
ఓటు హక్కు వినియోగించుకుంటున్న పట్టభద్రులు... 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న ఓటింగ్‌

వరంగల్, నల్గొండ, ఖమ్మం MLC పట్టభద్రుల ఉపఎన్నిక కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 4 వరకు జరగనుంది. 12 జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరగనున్న ఈ ఓటింగ్‌ కోసం 605 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఓటు వేసేందుకు ప్రైవేటు సంస్థల యజమాన్యాలు సహకరించాలని CEO వికాస్‌రాజ్‌ కోరారు. కాగా... జూన్ 5న ఈ ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. శాసనసభ ఎన్నికల్లో జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన స్థానానికి ఉపఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటు.. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరిగిన కొన్ని రోజులకే జరుగుతుండటంతో ప్రజలందరి దృష్టి ఈ ఎన్నిక పైనే ఉండనుంది. ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు... ప్రచారంలో ఎత్తులు, పైఎత్తులు, వ్యూహ, ప్రతివ్యూహాలను ప్రదర్శించాయి. రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న మూడు పార్టీల అభ్యర్థుల మధ్యే పోటీ తీవ్రంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, భారాస అభ్యర్థి రాకేశ్‌రెడ్డి, భాజపా నేత ప్రేమేందర్ ఎన్నికల బరిలో నిలవగా... వీరితో పాటు మరో 49 మంది పోటీలో నిలిచారు.


పట్టభద్రుల ఉపఎన్నికకు ఈనెల 2న నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల కమిషన్.. 9వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించింది. ఈనెల 25న సాయంత్రం 4 గంటలకు అభ్యర్థుల ప్రచారం ముగిసింది. ఈ ఎన్నికలో మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 4 లక్షల 63వేల 839 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 2 లక్షల 88 వేల 189 మంది పురుషులు, లక్ష 75 వేల 645 మంది మహిళలు ఉన్నారు. వరంగల్, హనుకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 605 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 118, అతితక్కువగా సిద్ధిపేటలో 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,448 మంది పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులను నియమించారు. ఓటింగ్‌ సందర్భంగా మద్యం దుకాణాలు బంద్‌ సహా.. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నిక బ్యాలెట్ పద్ధతిలో జరగనుంది. ప్రాధాన్యత ఓటు పద్ధతి కాబట్టి EVMలను వినియోగించరు. ఓటర్లు పోలింగ్ కేంద్రంలో అధికారులు ఇచ్చిన వయొలెట్ రంగు పెన్నుతో తమ ప్రాధాన్యతను టిక్ చేయాలి. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఎడమ చేతి చూపుడు వేలికి సిరా వేసినందున.. ఈ ఎన్నికల్లో ఎడమ చేయి మధ్య వేలికి పెట్టనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటాకు ఓటు వేయడానికి అవకాశం ఉండదు.

ఎండ తీవ్రత ఉంటే షామియానా, కుర్చీలు, మంచినీటి వసతి ఏర్పాటు చేయాలని పోలింగ్ అధికారులకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. ఒకవేళ వర్షం పడితే పోలింగ్ తో పాటు.. బ్యాలెట్ పత్రాల రవాణ సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఓటు వేసేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ సెలవు ఇచ్చారు. ప్రైవేట్ కార్యాలయాల సిబ్బంది ఓటు వేసేందుకు యాజమాన్యాలు సహకరించాలని.. షిఫ్టుల సర్దుబాటు.. ఆలస్యంగా వచ్చేందుకు లేదా మధ్యలో వెళ్లి ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని CEO వికాస్‌ రాజ్‌ కోరారు. లోక్‌సభ ఫలితాలు వెల్లడైన మరుసటిరోజు అంటే... జూన్ 5న MLC ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది.

Tags

Next Story