కరోనా మహమ్మారికి ముకుతాడు.. మోడెర్నా టీకా 94.1శాతం..

కరోనా మహమ్మారికి ముకుతాడు పడనుంది. కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనే వ్యాక్సిన్ ప్రయోగ దశను పూర్తి చేసుకుని, పంపిణీకి సిద్ధమవుతోంది. మోడెర్నా టీకా 94.1శాతం సమర్థతంగా పనిచేస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇప్పటికే టీకాను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిన మోడెర్నా సంస్థ.... తాజాగా అత్యవసర పరిస్థితుల్లో తమ టీకాను వినియోగించేందుకు యూఎస్ ఎఫ్‌డీఏ ఆమోదం కోసం అభ్యర్థన పంపింది. ఈ వ్యాక్సిన్ 94.1 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని నిర్ధారించారు. యూరోపియన్ మెడికల్ ఏజెన్సీకి కూడా నిబంధనలతో కూడిన ఆమోదం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు మోడెర్నా తెలిపింది...
మరోవైపు... ఇతర సంస్థలు కూడా వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉన్నాయి. అమెరికాకు చెందిన ఫైజర్, జర్మన్ కంపెనీ బయోఎన్‌టెక్ కలిసి అభివృద్ధి చేసిన టీకా క్రిస్మస్‌కు ముందే పంపిణీకి సిద్ధం కానుందని ఆయా సంస్థలు ఇప్పటికే వెల్లడించాయి. ఈ టీకా 95శాతం సమర్థతతో పనిచేస్తోందని, ఈ ఏడాది చివరికల్లా 5 కోట్ల డోసులను విడుదల చేస్తామని ప్రకటించాయి. ఈ టీకా 65 ఏళ్లకు పైబడ్డ వృద్ధుల్లోనూ సమర్థంగా పనిచేస్తోందని వివరించాయి. అటు ఆక్స్‌ఫర్డ్ టీకా అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. ఆక్స్‌ఫర్డ్ సాయంతో ఆస్ట్రాజెనెకా రూపొందించిన వ్యాక్సిన్‌తో వృద్ధుల్లోనూ 99శాతం యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు రెండో దశ ట్రయల్స్‌లో నిర్ధారణ అయింది. రష్యాకు చెందిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ కూడా 92శాతం సమర్థత కలిగినట్లు ఇది వరకే వెల్లడైంది. యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ పరిశోధకులు కరోనాను కట్టడి చేసే 'నాజల్ స్ర్పే' ను అభివృద్ధి చేస్తున్నారు. కాగా.. చైనాలో 3 ప్రధాన వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉండగానే 10 లక్షల మందికి టీకాలు వేసినట్లు చైనా ఫార్మా గ్రూప్ వెల్లడించింది.
ఫైజర్, ఆక్స్‌ఫర్డ్ టీకాలు సత్ఫలితాలిస్తుండడంతో భారత్‌లోనూ ఆయా టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పుణెకు చెందిన సీరమ్ సంస్థ ఆక్స్‌ఫర్డ్ టీకాపై ఒప్పందాలు కుదుర్చుకుంది. 3, 4 నెలల్లో ఈ టీకా భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశముందని సీరమ్ సీఈవో అదర్ పూణావాలా వెల్లడించారు. ఫైజర్ వ్యాక్సిన్ విషయంలోనూ భారత్ చర్చలు జరుపుతోందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు. కొవిడ్ టీకాల ఉత్పత్తి రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, వర్చువల్ రియాల్టీ(వీఆర్) సాంకేతికతను వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com