Telangana :కామారెడ్డిలో హద్దు మీరుతున్న వడ్డీ వ్యాపారుల ఆగడాలు

Telangana :కామారెడ్డిలో  హద్దు మీరుతున్న వడ్డీ వ్యాపారుల ఆగడాలు
అధిక వడ్డీలకు అప్పులిచ్చి, ఇష్టారీతిన వసూళ్లు , రంగంలోకి పోలీసులు

కామారెడ్డి జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు హద్దు మీరుతున్నాయి. అధిక వడ్డీలకు అప్పులిచ్చి ఇష్టారీతిన వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆలస్యమైతే బెదిరించడం, బాధితులను కిడ్నాప్‌ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గతంలో వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక నిజామాబాద్‌కు చెందిన ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది. వేధింపులపై తాజాగా ఫిర్యాదులు అందడంతో.. జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

అమాయకపు ప్రజల అవసరాలే వడ్డీ వ్యాపారుల ఆదాయాలుగా మారుతున్నాయి. పేదలకు అధిక వడ్డీలకు అప్పులిచ్చి... సాధారణం కంటే రెట్టింపు వడ్డీ వసూలు చేస్తూ... వారి శ్రమను దోచేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో కొందరు వడ్డీ వ్యాపారులు అడ్డూ అదుపు లేకుండా చెలరేగి పోతున్నారు. లక్ష రూపాయలు అప్పు ఇచ్చి... ఆరు నెలల్లోనే రెండు లక్షలు వసూలు చేస్తున్నారు. అప్పు చెల్లించ లేని పక్షంలో... కొందరైతే ఏకంగా దాడులు దిగుతున్నారు. రుణం తీసుకున్న వారి కుటుంబ సభ్యుల్ని అపహరించి.. భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.

కామారెడ్డి చెందిన యాదగిరి అనే వ్యక్తి ఇద్దరు వడ్డీ వ్యాపారుల దగ్గర లక్ష రూపాయలు అప్పుగా తీసుకుని... 59 వేలు తిరిగి చెల్లించాడు. అనారోగ్యం పాలై... తీసుకున్న అప్పు చెల్లించడంలో కొంత ఆలస్యమైంది. అంతలోనే తండ్రి తీసుకున్న అప్పు చెల్లించడం లేదని...అతని కుమారుడు సాయికుమార్‌ను గత మంగళవారం రాత్రి కొట్టి నిర్బంధించారు. బుధవారం భవననిర్మాణ పనికి తీసుకెళ్లగా... యువకుడు తప్పించుకొని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

వడ్డీ వ్యాపారుల వేధింపులపై ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్రమంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నవారి ఇళ్లలో 184 ప్రామిసరీ నోట్లు, 12 చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై మనీలాండరింగ్ అతిక్రమణ చట్టం కింద కేసులు నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఒక్కరోజులోనే 14 కేసులు నమోదయ్యాయి. తనిఖీలు కొనసాగే అవకాశం ఉండటంతో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story