Kamareddy: తల్లీకొడుకు ఆత్మహత్య కేసు.. తమకు ఏ సంబంధం లేదంటున్న ఏ1, ఏ2..

Kamareddy: అక్కడ వ్యాపారం చేయాలంటే ప్రభుత్వ అనుమతులున్నా లేకున్నా పర్లేదు. కానీ ఈ నయా నయీమ్స్ అనుమతి తప్పనిసరి. రియల్ వ్యాపారమైతే భాగస్వామ్యం ఇవ్వాల్సిందే. వీళ్లను కాదని ఎవరైనా అడుగు ముందుకేస్తే టార్చర్ చూపిస్తారు. ప్రాణాలపై ఆశలు వదులుకునేలా చేస్తారు.. అసలు మెదక్ జిల్లా రామాయంపేటలో ఏం జరుగుతోంది….?
అధికార పార్టీ నేతల వేధింపులు తాళలేక తల్లీకొడుకులు గంగం సంతోష్, పద్మ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. దానికి ముందు తమపై జరుగుతున్న వేధింపుల గురించి సెల్పీ వీడియో తీశారు. సూసైడ్ నోట్ రాశారు. రామాయంపేట మున్సిపల్ ఛైర్మన్ జితేందర్‌గౌడ్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ సరాఫ్ యాదగిరి, సీఐ నాగార్జున గౌడ్‌తో పాటు మరో నలుగురి వేధింపులే కారణమని స్పష్టంగా పేర్కొన్నారు.
న్యాయం చేస్తామని చెప్పినా.. ఆ కుటుంబ సభ్యుల్లో ఇప్పటికీ ప్రాణభయం పోవడం లేదు. సంతోష్‌ని వేధించినట్లు తమనూ వేధిస్తారన్న భయం వారిని వెంటాడుతోంది. సంతోష్ పేర్కొన్న జితేందర్‌గౌడ్, సరాఫ్ యాదగిరి అరాచకాలపై ఒక్కొక్కరు నోరు విప్పుతున్నారు. పాన్ డబ్బా పెట్టుకోవాలన్నా.. వీరి అనుమతి తీసుకోవాలన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మాయంపేట జాతీయ రహదారి 44 పక్కనే ఉంటుంది. దీంతో ఇక్కడి భూములకు భారీ డిమాండ్ ఉంది. వెంచర్ల ఏర్పాటు భూ క్రయ విక్రయాలు భారీగా జరుగుతుంటాయి. వీటిలో వీరికి వాటా ఇవ్వాల్సిందే. సంతోష్‌ను సైతం వాటా కోసం డిమాండ్ చేశారు. సెటిల్‌మెంట్లు సైతం అదే స్థాయి. బస్టాండ్ పక్కనే 9 కుటుంబాలు 40 సంవత్సరాలుగా నివసిస్తున్నారు. దీనిపై స్థానికంగా ఉన్న మరో వర్గం, వీరికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంలోనూ తలదూర్చారు.
భూ క్రయవిక్రయాల్లో వాటా ఇవ్వకపోతే.. రిజిస్ట్రేషన్ కాకుండా ఆపడం, తహసిల్దార్ కార్యాలయం ద్వారా కొర్రీలు పెట్టిస్తారన్న ఆరోపణలున్నాయి. తాను అడిగినంత వాటా ఇవ్వకపోతే.. ఇలాగే చేశారంటూ చనిపోయే ముందు సంతోష్ వెల్లడించాడు. అవసరమైతే పోలీసులను, ప్రభుత్వ యంత్రాంగాలను వాడుతారు. ఓ సీఐ సెల్‌ఫోన్ లాక్కుని అందులోని వ్యక్తిగత సమాచారాన్ని వీరికి అందించాడంటే వీరి నెట్‌వర్క్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
పట్టణంలోనూ, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారిలోనూ బాధితులు భారీగానే ఉన్నారన్న ప్రచారం రామాయంపేట సర్కిళ్లలో సాగుతోంది. ప్రభుత్వం, పోలీసులు భరోసా కల్పిస్తే.. వీరంతా బయటికి వచ్చే అవకాశముంది. ఇలా ఒక్కటేమిటీ.. పట్టణంలో చీమ చిటుక్కుమన్నా.. తెలిసేలా నెట్‌వర్క్ ఉంది. దానిని ఆధారంగా చేసుకునే ఇలా మాఫియా రాజ్యం ఏర్పాటు చేసుకున్నారు. నయీంలా అరాచకాలూ చేస్తున్నారు.
అయితే.. కేసుతో తమకు సంబంధం లేదంటున్నారు జితేందర్ గౌడ్ యాదగిరి. ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారిస్తే.. నిజానిజాలు పూర్తి స్థాయిలో బయటికి వచ్చే అవకాశముంది. మరోవైపు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు రామాయంపేటలో గంగం సంతోష్ ఇంటికి చేరుకున్నారు. బాన్సువాడ డీఎస్పీ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యుల్ని విచారిస్తున్నారు. ఈ వేధింపుల వ్యవహారంలో బాధిత కుటుంబీకులతోపాటు స్థానికుల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. వీలైనంత త్వరగా కేసు కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com