టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి : బండి సంజయ్

టీఆర్ఎస్ కుటుంబ, అవినీతి ప్రజావ్యతిరేక పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తెలిపారు. మరో మూడేళ్లు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని, కేటీఆర్ ను సీఎం చేసే ఆలోచన కేసీఆర్ కు లేదని ఆరోపించారు. వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు బీజేపీ వైపు నిలబడుతున్నారని వెల్లడించారు.
ఇందుకు ఇటీవల జరిగిన దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలు నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. కేసీఆర్ కుటుంబం ఆరేళ్లుగా చేస్తున్న అవినీతి అక్రమాల చిట్టా త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసి అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని సంజయ్ పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com