బండి సంజయ్ వరంగల్ పర్యటన ఉద్రిక్తం!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరంగల్ పర్యటన ఉద్రిక్తంగా సాగుతోంది. కడిపికొండ బ్రిడ్జి వద్ద బండి సంజయ్‌కి ఘన స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు. కడిపికొండ బ్రిడ్జి నుంచి కాజిపేట, హన్మకొండ, వరంగల్ వరకు ర్యాలీకి బయల్దేరారు. మార్గమధ్యలో పోచమ్మ మైదాన్ చౌరస్తాలోని సాయిబాబా ఆలయంలో సంజయ్ పూజలు చేశారు.
రెండేళ్ల క్రితం సాయిబాబా ఆలయ పూజారిని దుండగులు హత్య చేశారు. అప్పుడు పూజారి అంత్యక్రియలో పాల్గొన్న సంజయ్ పూజారి పాడె మోశారు. ఇవాళ్టి పర్యటన సందర్భంగా పూజరిని స్మరించుకుంటూ ఆలయాన్ని సందర్శించారు.
అటు సంజయ్ పర్యటన సందర్భంగా వరంగల్ పోచమ్మ మైదాన్ జంక్షన్‌లో ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీ ముందుగా ప్లాన్ చేసినట్టుగా మండి బజార్ మీదుగా వెళ్లేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు. అయితే.. ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. మండి బజార్ మీదుగా వెళ్తే ఘర్షణలు జరుగుతాయని పోలీసులు వెల్లడించారు. ఆ దారి వైపు వెళ్లకుండా బారీకేడ్లు పెట్టారు.
ఇదే సమయంలో అటు వైపు వచ్చిన మేయర్ గుండా ప్రకాశ్, ఎమ్మెల్యే ఆరూర్ రమేశ్ కాన్వాయ్‌కి పోలీసులు అనుమతి ఇచ్చారు. తమను అడ్డుకుని టీఆర్‌ఎస్ నాయకులకు అనుమతి ఎలా ఇస్తారని బీజేపీ నేతలు పోలీసుల్ని నిలదీశారు. టీఆర్‌ఎస్ నేతల కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జంక్షన్‌లో ఉద్రిక్తత తలెత్తింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com