హుజూరాబాద్ ఎన్నికల కోసమే కొత్త రేషన్‌కార్డులు : ఎంపీ వెంకట్‌రెడ్డి

సీఎం కేసీఆర్... నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అరెస్టును ఆయన ఖండించారు. ఏడేళ్లగా గుర్తురాని రేషన్ కార్డుల పంపిణీ... హుజురాబాద్ ఎన్నికల కోసం ప్రారంభించారని ఆరోపించారు. గ్రామానికి కేవలం 40 మాత్రమే కొత్త రేషన్ కార్డులిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో కనీసం ప్రోటోకాల్ కూడా పాటించడంలేదన్నారు. దీన్ని ప్రశ్నించినందుకే రాజగోపాల్‌రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి, అరెస్ట్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిట్లర్ కంటే మించిన పాలన తెలంగాణలో నడుస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
ఉదయం నాటకీయ పరిణామాల మధ్య నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మునుగోడులో ఇవాళ రేషన్ కార్డుల పంపిణీకి వెళ్తుండగా అడ్డుకుని... అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని రాజగోపాల్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో.. అవుటర్ రింగ్ రోడ్ వద్ద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఇక మూడు రోజుల క్రితం చౌటుప్పల్ గొడవ నేపథ్యంలో ఎమ్మెల్యేను ముందుగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com