Muchintal: ముచ్చింతల్‌లో ఆధ్మాత్మిక వాతావరణం.. 12 రోజులు సమతామూర్తి ఉత్సవాలు..

Muchintal: హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్ లో ఆధ్మాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. 12 రోజుల పాటు జరిగే సమతామూర్తి ఉత్సవాలు.. తొలి రోజు పెరుమాళ్ల శోభాయాత్రతో మొదలయ్యాయి. త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో వేలాది మంది రుత్వికులు, పీఠాధిపతులు, ఆశ్రమ విద్యార్థులు.. శ్రీమన్నారాయణ అష్టాక్షరి మంత్రోచ్ఛరణతో పల్లకిలో పెరుమాళ్లు యాగశాలకు చేరుకున్నారు.
వేడుకల్లో భాగంగా మొదలుపెట్టిన విశ్వక్ సేనుడి పూజ, వాస్తు శాంతి పూజ విజయవంతంగా జరిగింది. సమతామూర్తి విగ్రహా ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా జీయర్ ఆస్పత్రి ప్రాంగణం నుంచి యాగశాల వరకు నిర్వహించిన శోభాయాత్రతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6 గంటలకు సహస్రాబ్ది ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది.
అంతకుముందు.. అశ్వవాహనంపై దివ్వసాకేత రామచంద్రుడి శోభాయాత్ర కనులపండుగగా జరిగింది. ఉదయం వాస్తు ఆరాధన తర్వాత శోభాయాత్రను ప్రారంభించారు. దివ్వసాకేతం నుంచి యాగశాల వరకు శోభాయాత్ర జరిగింది. మంగళవాయిద్యాలు మారుమోగుతుండగా వేదపండితులు, పెద్ద సంఖ్యలో భక్తుల మధ్య శ్రీరామనగరం వీధుల్లో శోభాయాత్ర జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన జీయర్ స్వాములు శోభాయాత్రలో పాలుపంచుకున్నారు.
కులమతాలకు అతీతంగా సమానత్వ సిద్ధాంతానికి పాటుపడిన జగద్గురు శ్రీ రామానుజాచార్యుల వెయ్యేళ్ల వేడుకలు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లోని శ్రీ రామనగరంలో నిర్వహిస్తున్నారు. శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం పేరుతో నేటి నుంచి ఫిబ్రవరి 14 వరకు జరగనున్న ఈ వేడుకల్లో.. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని జాతికి అంకితం చేయనున్నారు.
216 అడుగుల ఎత్తున నిర్మించిన రామానుజాచార్య విగ్రహాన్ని వైభవంగా ఆవిష్కరించనున్నారు. స్వయంగా త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ సహస్రాబ్ది వేడుకలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా భారీ ఎత్తున లక్ష్మీనారాయణ మహాయజ్ఞం కొనసాగనుంది. 108 దివ్యదేశాల ప్రతిష్టాపన, కుంభాభిషేకం, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ, సమతామూర్తి లోకార్పణ జరగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com