MUNCIPAL POLL: పురపాలక ఉత్కంఠకు నేటితో తెర

తెలంగాణలో ఉత్కంఠ నడుమ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నేడు జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో నేడు ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో తమ పట్టు నిలుపుకునేందుకు ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమించాయి. పలు చోట్ల పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్నట్లు కొనసాగింది. ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. ఒక దశలో ప్రచారంలో ప్రధాన పార్టీల నేతలు తిట్లపురాణం అందుకున్నారు. అన్ని పార్టీల హామీలు, ప్రచారాన్ని నిశితంగా గమనించిన ఓటర్లు పార్టీల భవిష్యత్ ను, అభ్యర్థుల అదృష్టాన్ని ఓటు రూపంలో బ్యాలెట్ బాక్కుల్లో నిక్షిప్తం చేశారు. ఓటర్లు ఏ మున్సిపాలిటీలో ఏ పార్టీకి పట్టం కట్టారో నేడు తేలనుంది. మొత్తం 116 మున్సిపాలిటీలలోని 2582 వార్డులకు గాను 12 వార్డులు ఏకగ్రీవం కాగా ఒక చోట వాయిదా పడింది. దీంతో ఇవాళ 2569 వార్డులకు పోలింగ్ జరిగింది. ఇక 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి 414 వార్డుల్లో 2 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.మిగిలిన 412 వార్డులకు పోలింగ్ నిర్వహించారు. వీటి ఫలితాలన్నీ నేడు తేలనున్నాయి. ఫలితాలపై అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
80 శాతానికిపైగా స్థానాలు మావే
పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్, పురపాలికల్లోనూ తిరుగులేదని ధీమాగా ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి పట్టణ ఓటర్లు తమకే పట్టం కడతారని అధికార పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో జరిగిన ఎన్నికల్లో 80 శాతానికి పైగా స్థానాలు దక్కుతాయని కాంగ్రెస్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు దగ్గరగానే ఫలితాలు ఉండబోతున్నట్లు పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అసెంబ్లీ, పంచాయతీ తరహాలోనే పట్టణాల్లోనూ ఆధిపత్యం సాధించాలని ప్రణాళికాబద్ధంగా పని చేసింది. ఫలితాల సరళిని అంచనా వేసిన అధికార పార్టీ నాయకులు, ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నాయని తేల్చి చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలోనూ ఏకపక్ష ఫలితాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి మెదక్, వరంగల్ జిల్లాల్లో బీఆర్ఎస్,–కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొన్నట్లు భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
