MUNCIPOLLS: ప్రచారం ముగిసింది.. ప్రలోభం మొదలైంది

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం ముగిసింది. సోమవారం సాయంత్రంతో పురపాలికల ఎన్నికల ప్రచారానికి అధికారికంగా తెరపడింది. గత కొన్ని రోజులుగా నేతల ప్రసంగాలతో హోరెత్తిన మైకులు ఇక మూగబోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు నిర్వహించనున్న ఎన్నికల ప్రచారం ముగియడంతో పోలింగ్‌కు రంగం సిద్ధమవుతోంది. ప్రచారం ముగిసిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఏర్పాట్లపై దృష్టి సారించింది. కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల పరిశీలకులు, కోఆర్డినేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎన్నికల అధికారులు, పోలింగ్ ఏర్పాట్లు, బ్యాలెట్ బాక్సుల తరలింపు, ఎన్నికల సామగ్రి పంపిణీ వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ నెల 11వ తేదీన పోలింగ్ నిర్వహించి, 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. పోలింగ్, ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి.
ప్రచారానికి చివరి రోజు కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు తమ అగ్రనేతలను రంగంలోకి దింపాయి. ఓటర్లను ఆకట్టుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించగా, ఆరోపణలు–ప్రత్యారోపణలతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. చివరి రోజు జరిగిన ప్రచారంలో నేతల మాటలు తీవ్ర స్థాయిలో ఉండటంతో, ఓటర్లు ఎవరి వాదనలకు మద్దతు ఇస్తారన్న ఉత్కంఠ నెలకొంది. భూపాలపల్లిలో జరిగిన ప్రచార సభలో కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో కేసీఆర్‌పై విమర్శలు చేసిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. భూపాలపల్లి జిల్లాకు సంబంధించి సీఎం వ్యాఖ్యలపై కూడా ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఇక రామయంపేటలో జరిగిన సభలో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, కొంతమంది పోలీసులు హద్దులు దాటుతున్నారని వ్యాఖ్యానించారు. రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, తానే మంత్రిగా ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు అధికార వర్గాల్లో చర్చకు దారితీశాయి. కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో స్పందించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ తీవ్ర పదజాలంతో కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ వ్యాఖ్యలు అనవసరమని మండిపడ్డారు. అదే సమయంలో కాంగ్రెస్ నేత సామరామ్మోహన్ రెడ్డి కూడా కేటీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ వేడి పెంచారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
