Munugode: మునుగోడు రాజకీయం.. హామీలు గుప్పిస్తున్న నేతలు..

Munugode: మునుగోడు రాజకీయం.. హామీలు గుప్పిస్తున్న నేతలు..
Munugode: మునుగోడులో రాజకీయం రణక్షేత్రాన్ని తలపిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి.

Munugode: మునుగోడులో రాజకీయం రణక్షేత్రాన్ని తలపిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. పైగా మునుగోడులో ఎన్నికల ప్రచారం రేపటితో ముగుస్తోంది. ప్రచారానికి కొన్నిగంటలే గడువు ఉండడంతో.. పార్టీలు జోరు పెంచాయి.


ఎవరికి తగ్గట్లుగా వాళ్లు వినూత్న ప్రచారంతో ఓటర్ల మనసు గెలిచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. మూడు పార్టీల నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీలు గుప్పిస్తూ, ప్రజల అవసరాలను తీరుస్తూ ఓట్లు అడుగుతున్నారు. క్యాంపెయిన్‌లో స్పీడ్ పెంచిన పార్టీలు.. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

టీఆర్‌ఎస్‌ ప్రచారంలో దూకుడుగా వెళ్తోంది. సీఎం కేసీఆర్ బహిరంగ సభతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో గెలుస్తామనే ధీమా మరింత పెరిగింది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లు.. మునుగోడు నియోజకవర్గాన్ని సెగ్మెంట్ల వారీగా విభజించి ప్రచారం చేస్తున్నారు.


రేపు సాయంత్రం ఐదు గంటల వరకు అదే ఊపుతో ప్రచారం నిర్వహించాలని పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు వెళ్లాయి. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలు మరోసారి చెప్పాలని అధినేత ఆదేశించారు. దీంతో మునుగోడులో ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహిస్తోంది టీఆర్ఎస్.

మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో బీజేపీ స్పీడ్ పెంచింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు 40 మంది స్టార్ క్యాంపెయినర్లు మునుగోడులోనే మకాం వేసి ఉద్ధృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో కేంద్రమంత్రులు, రాష్ట్ర నాయకులు పాల్గొంటున్నారు.


ఇవాళ ఒకే రోజు 9 బహిరంగ సభలకు ప్లాన్ చేసింది బీజేపీ. ఇందుకోసం 7 మండలాలు, 2 మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రచారానికి రేపే చివరి రోజు కావడంతో.. అన్ని గ్రామాల్లో నేతలు బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు.


ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న బీజేపీ.. ఇప్పటికే ఇంటింటి ప్రచారం చేస్తోంది. టీఆర్ఎస్‌ సర్కార్ వైఫల్యాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి.

మరోవైపు మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. రోడ్ షోలతో ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే పీసీసీ ముఖ్యనేతలంతా క్యాంపెయిన్‌లోనే ఉన్నారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story