Munugode: మునుగోడు ఉప ఎన్నిక.. తారాస్థాయిలో ప్రచారం..

Munugode: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. మూడు ప్రధాన పార్టీలు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎన్నికల ఎత్తుగడలో అనూహ్యంగా దూకుడు పెంచింది అధికార పార్టీ టీఆర్‌ఎస్. టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా స్వయంగా రంగంలోకి దిగిన మంత్రి కేటీఆర్.. టీఆర్‌ఎస్ నుంచి వెళ్లిపోయిన నేతలను మళ్లీ కారు ఎక్కిస్తున్నారు.
ప్రచారాన్ని సైతం పరుగులు పెట్టిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. మునుగోడు ఆత్మగౌరవం గుజరాత్ గద్దల వద్ద తాకట్టు పెట్టారంటూ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నిన్న చౌటుప్పల్‌లో రోడ్‌షో నిర్వహించారు.
మిషన్ భగీరథకు 19 వేల కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్ సిఫారసు చేస్తే.. ప్రధాని మోదీ 19 పైసలు కూడా ఇవ్వలేదని, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మాత్రం 18వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చారని ఆరోపించారు. నల్లధనం తెస్తానన్న ప్రధాని మోదీ తెల్లముఖం వేశారని, చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధించిన మొదటి ప్రధాని మోదీనేనని విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేయకుండా, కార్పొరేట్లకు మాత్రం పదకొండున్నర లక్షల కోట్లు మాఫీ చేశారని మండిపడ్డారు.
మునుగోడులో బీజేపీ కూడా దూకుడుగా ప్రచారం చేస్తోంది. తెలంగాణ యువత, ప్రజల భవిష్యత్ మునుగోడు ఎన్నికల ఫలితంపైనే ఆధారపడి ఉందన్నారు బండి సంజయ్. యువత, ప్రజలను సాదుకుంటారా, సంపుకుంటారా అనేది మునుగోడు ప్రజలే ఆలోచించాలని కోరారు. మునుగోడు ఉప ఎన్నిక స్థానికుల కోసం కాదని.. తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసం వచ్చిన ఎన్నిక అని తెలిపారు.
నిన్న సంస్థాన్ నారాయణపురంలో బండి సంజయ్ రోడ్ షో నిర్వహించారు. గొర్రెల కాపరులకు రావాల్సిన డబ్బులు నిలిపివేయాలని తాను లేఖ రాశానని ముఖ్యమంత్రి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సంస్థాన్ నారాయణపురం శివాలయం సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధమా అని సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు.
కేసీఆర్ కుటుంబానికి మంత్రులు, ఎమ్మెల్యేలు కట్టప్పలని.. కట్టు బానిసలుగా మారారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. మునుగోడు మండలంలోని చల్మెడ, కోతులాపురం, ఇప్పర్తి గ్రామాల్లో కిషన్‌రెడ్డి ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక గ్రామస్థాయిలో బూత్‌కి ఇన్‌ఛార్జిగా ఉన్నారంటే టీఆర్‌ఎస్ ఎంత దిగజారిపోయిందో అర్థమవుతోందన్నారు.
ఓవైపు టీఆర్‌ఎస్, బీజేపీ ప్రచారంలో దూకుడుగా వెళ్తుంటే.. సిట్టింగ్ స్థానంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం వెనకబడింది. పైగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆడియో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలంతా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికే ఓటు వేయాలని ఎంపీ కోమటిరెడ్డి చెప్పినట్టుగా చెబుతున్న ఆడియో వైరల్‌గా మారింది.
కాంగ్రెస్ ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించాలని పిలుపునిచ్చారంటూ కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. మునుగోడులో కాంగ్రెస్ ఓడిపోతే పీసీసీ చీఫ్‌గా తననే నియమిస్తారని కోమటిరెడ్డి మాట్లాడారంటూ ఓ ఆడియోను తెరపైకి తీసుకొచ్చారు.
అంతకు ముందు రోజే.. పీసీసీ చీఫ్ పదవి కోసం కొందరు కుట్రలు చేస్తున్నారంటూ రేవంత్‌రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. మొత్తానికి మునుగోడులో మిగతా పార్టీలు ప్రచారంపై ఫోకస్ పెడితే.. కాంగ్రెస్ మాత్రం అంతర్గత కలహాల మధ్యే ఉండిపోతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com