Munugode: మునుగోడు ఉపఎన్నిక.. ప్రచారానికి మరికొన్ని గంటల్లో తెర

Munugode: మునుగోడు ఉపఎన్నిక.. ప్రచారానికి మరికొన్ని గంటల్లో తెర
Munugode: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి మరికొన్ని గంటల్లో తెరపడుతోంది. అందుకే చివరి రోజున పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.

Munugode: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి మరికొన్ని గంటల్లో తెరపడుతోంది. అందుకే చివరి రోజున పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు రోడ్‌షోల్లో పాల్గొంటున్నారు.


నారాయణపురం, మునుగోడు మండలాల్లో మంత్రి కేటీఆర్‌, అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి రోడ్‌షో నిర్వహిస్తున్నారు. నాంపల్లి మండలంలో మంత్రులు హరీ‌ష్‌రావు, తలసాని శ్రీనివాస్‌ రోడ్‌షో చేస్తున్నారు. చండూరు మండలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చౌటుప్పల్‌లో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, మల్లారెడ్డి భారీ ర్యాలీలకు ప్లాన్ చేశారు.

అటు బీజేపీ కూడా ప్రచారాన్ని మరింత పరుగులు పెట్టిస్తోంది. బండి సంజయ్‌, ఎంపీ అర్వింద్‌, రాజగోపాల్‌రెడ్డి రోడ్‌ షోలో పాల్గొంటున్నారు. నిన్న 5వేల బైకులతో.. 35 కిలోమీటర్ల మేర ర్యాలీ చేపట్టారు. ఇవాళ చండూరు, గట్టుప్పల్‌, నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో ర్యాలీలు, రోడ్‌ షోలతో హోరెత్తిస్తోంది బీజేపీ.


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 12 రోజులుగా మునుగోడులోనే ఉన్నారు. ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, ఎంపీ అర్వింద్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మునుగోడులో సుడిగాలి పర్యటనలు చేశారు.

మునుగోడులో 55 వేల మందితో మహిళా గర్జన ఏర్పాటు చేస్తోంది కాంగ్రెస్‌ పార్టీ. నియోజకవర్గంలో దాదాపు సగం మంది మహిళా ఓటర్లే ఉండడంతో.. కాంగ్రెస్‌ పార్టీ మహిళా ఓట్లపై దృష్టిలో ఫోకస్ పెట్టింది. 74 వేల మహిళా ఓట్లు సాధిస్తే విజయం తమదేనని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది.


ప్రతి బూత్‌ నుంచి 300 మహిళా ఓట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. మహిళా గర్జనకు రేణుకాచౌదరి, కొండా సురేఖతో పాటు అభ్యర్థి పాల్వాయి స్రవంతి, ఆమె తల్లి సభకు హాజరవుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం హాజరుకానున్నారు.

మరోవైపు నేతల కార్లను తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. మునుగోడులో మహిళా గర్జన సభకు వెళ్తున్న పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌ని ఆపారు. నారాయణపురం చెక్‌పోస్ట్‌ వద్ద రేవంత్‌రెడ్డి వాహనాన్ని ఆపి తనిఖీలు చేశారు. అటు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వాహనాలను రాంరెడ్డిపల్లి చెక్‌పోస్ట్‌ వద్ద తనిఖీ చేశారు పోలీసులు.

మునుగోడు నియోజకవర్గంలో నెలన్నరగా నెలకొన్న ఉప ఎన్నిక సందడి.. కొన్ని గంటల్లోనే మూగబోనుంది. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌, ఇతర పార్టీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీల నేతలు సాయంత్రం వరకే ప్రచారంలో కనిపించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story