Munugode: మునుగోడులో పెరిగిన ఎన్నికల హీట్.. ప్రచారానికి ప్రణాళికలు..

Munugode: మునుగోడులో పెరిగిన ఎన్నికల హీట్.. ప్రచారానికి ప్రణాళికలు..
Munugode: మండలాలు, గ్రామాల వారీగా నియమించుకున్న ఇన్‌చార్జీలను అన్ని పార్టీలు అలర్ట్ చేశాయి ప్రధాన పార్టీలు.

Munugodu: ఎన్నిక షెడ్యూల్ రాగానే మునుగోడులో హీట్ పెరిగింది. అన్ని పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టాయి. ప్రచారాలు, సభల నిర్వాహణకు ప్రణాళికలు రచిస్తున్నాయి. మండలాలు, గ్రామాల వారీగా నియమించుకున్న ఇన్‌చార్జీలను అన్ని పార్టీలు అలర్ట్ చేశాయి ప్రధాన పార్టీలు.

జాతీయ రాజకీయాల వైపు వేగంగా అడుగులు వేస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. మునుగోడులో గెలిచి నేషనల్ పాలిటిక్స్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే అందుబాటులో ఉన్న మంత్రులు, నేతలతో ప్రగతి భవన్‌లో సమీక్షించారు. దసరా నాడే అంటే రేపు జాతీయ పార్టీతో పాటు మునుగోడు టీఆర్ఎస్‌ అభ్యర్థిని ప్రకటించాలని నిర్ణయించారు.

పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని అధికారికంగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. జాతీయ పార్టీగా మార్పు కోరుతూ పార్టీ నేతలు ఎల్లుడి భారత ఎన్నికల సంఘానికి అఫిడవిట్ సమర్పించనున్నారు. ఆమోదం పొందిన తర్వాత ప్రభాకర్ రెడ్డికి జాతీయ పార్టీ పేరిట బీఫారం అందజేయాలని చూస్తున్నారు.

మరోవైపు మునుగోడు ఇన్‌ఛార్జ్‌లంతా ఎల్లుండి నుంచి మునుగోడులోనే ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించారు. ప్రతి యూనిట్‌ బాధ్యతను ఒక ఎమ్మెల్యేకు అప్పగించారు. మంత్రులు కేటీఆర్, హరీష్‌తో పాటు పలువురు సీనియర్ నేతలకు ఈ యూనిట్ బాధ్యతలు అప్పజెప్పారు సీఎం. ఇక మునుగోడులో మరో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

సిట్టింగ్ సీటును కాపాడుకోవడానికి కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. గాంధీభవన్‌లో ఏఐసీసీ ప్రెసిడెంట్ మాణిక్కం ఠాగూర్, పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. మునుగోడు ఉపఎన్నికల ప్రచారం, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మండల ఇన్‌చార్జీలు హాజరయ్యారు. మరోవైపు సాయంత్రం భారత్ జోడోయాత్రపై సమీక్ష సమావేశం జరుగనుంది. దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్ ఈ సమావేశానికి హాజరై రాహుల్ రూట్‌ మ్యాప్‌పై సమీక్షించనున్నారు.

తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని చెబుతున్న బీజేపీ.. మునుగోడులో ఎట్టి పరిస్థితుల్లో నెగ్గి తీరాలనే పట్టుదలతో ఉంది. బీజేపీ అధిష్టానం సైతం మునుగోడుపై ఫోకస్ పెట్టింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు, ఓట్లు, మండలాలు, గ్రామాలు.. ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటున్న బీజేపీ.. కీలక నేతలందర్నీ మునుగోడు ప్రచార బరిలో దింపేలా స్టీరింగ్ కమిటీని సిద్ధం చేసింది. అలాగే పార్టీలో చేరికలపై మాజీ ఎంపీ వివేక్ నేతృత్వంలోని స్టీరింగ్ కమిటీ దృష్టి పెట్టింది. ఈ నెలాఖరులో మరోసారి జాతీయ నేతలతో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది బీజేపీ.

మూడు పార్టీలూ తమ అభ్యర్ధులపై కొండంత నమ్మకం పెట్టుకొని బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వరుస ఓటములను చవిచూసింది. దీంతో మునుగోడు ఉపఎన్నిక అధికార టీఆర్‌ఎస్ పార్టీకి కీలకం కానుంది. ఇటు కాంగ్రెస్, బీజేపీ కూడా తెలంగాణలో తమ పట్టు సాధించేందుకు తహతహలాడుతున్నాయి. మరి ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story