భర్తకు ప్రేమతో పాటు కాలేయాన్ని పంచి..

భర్తకు ప్రేమతో పాటు కాలేయాన్ని పంచి..
ప్రాణంగా ప్రేమించిన భర్తకు ప్రాణం పోసింది. కాలేయంలోని సగ భాగం ఇచ్చి భర్తను బతికించుకుంది ఓ ప్రేమైక మూర్తి.

ప్రాణంగా ప్రేమించిన భర్తకు ప్రాణం పోసింది. కాలేయంలోని సగ భాగం ఇచ్చి భర్తను బతికించుకుంది ఓ ప్రేమైక మూర్తి. కులం కాని వాణ్ణి చేసుకుంటేనే కుల పెద్దల చేత ఊరి బహిష్కరణకు గురవుతున్న ప్రేమ కథలు ఎన్నో. అలాంటిది మతం కాని వాణ్ణి ప్రేమించింది.. మనువాడేందుకు సిద్దపడింది ముంతాజ్. తమ ప్రేమ మరికొందరికి ఆదర్శం కావాలని 21 ఏళ్ల క్రితమే పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు ఆ ప్రేమికులు. ప్రొద్దుటూరుకు చెందిన వెంకట సుబ్బారెడ్డి, ముంతాజ్ మతాంతర వివాహం చేసుకున్నారు.

కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందన్నట్లు సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు వీరిని దూరం పెట్టినా ముంతాజ్ తల్లిదండ్రులు ప్రేమజంటకు అండగా నిలబడ్డారు. ఈ దంపతులకు ఒక కొడుకు, కూతురు పుట్టారు. అయితే గత కొంత కాలంగా వెంకట సుబ్బారెడ్డి కాలేయ సమస్యతో బాధపడుతున్నాడు.

హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని గ్లెనీగల్స్ గ్లోబల్ ఆస్పత్రిలో చూపించగా లివర్ సిరోసిస్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. లివర్ బాగా దెబ్బతిందని, కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు నిర్ధారించారు. దీంతో దాతల కోసం ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో భర్తను కాపాడుకునేందుకు భార్య ముంతాజ్, ఆమె కుటుంబసభ్యులు ముందుకొచ్చారు.

డాక్టర్లు పరీక్షలు నిర్వహించగా ముంతాజ్ కాలేయం మాత్రమే భర్తకు సరిపోతుందని తేలింది. దీంతో మార్చి చివరి వారంలో వెంకట్‌రెడ్డికి గ్లోబల్ ఆస్పత్రి సీనియర్ వైద్యుడు డాక్టర్ రాఘవేంద్రబాబు పర్యవేక్షణలో కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చేశారు.

ప్రస్తుతం సుబ్బారెడ్డి ఆరోగ్యంగా ఉన్నాడని లీడ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఫిజీషియన్ డాక్టర్ కేఎన్ చందన్ కుమార్ తెలిపారు. ముంతాజ్ ఆరోగ్యం కూడా మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. ముంతాజ్, సుబ్బారెడ్డి దంపతులకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. సుబ్బారెడ్డికి శస్త్ర చికిత్సను నిర్వహించిన వైద్యులకు గ్లోబల్ ఆస్పత్రి సీఈవో గౌరవ్ ఖురానా అభినందించారు.

Tags

Read MoreRead Less
Next Story