తెలంగాణ బీజేపీలో డైలీ సీరియల్‌ను తలపిస్తోన్న నాగార్జున సాగర్ అభ్యర్థి ఎంపిక!

తెలంగాణ బీజేపీలో నాగార్జున సాగర్ అభ్యర్థి ఎంపిక డైలీ సీరియల్‌ను తలపిస్తోంది. సాగర్ బరిలో ఎవరిని దింపాలన్న దానిపై కసరత్తు కొనసాగుతోంది. ఏ సామాజిక వర్గానికి ఇస్తే పార్టీ గెలుపు అవకాశాలు ఉంటాయి.. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లను ఎదుర్కొనే సత్తా ఉన్న క్యాండిడేట్ ఎవరన్న దానిపై సుదీర్ఘ మంతనాలు సాగుతున్నాయి. ఎస్టీ, బీసీ, ఓసీ సామాజిక వర్గాలకు చెందిన నేతలు బలంగా టికెట్ కోరుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర పార్టీ మొగ్గెవరి వైపు.. ఎవరిని బరిలో దింపనుందనేది సస్పెన్స్‌గా మారింది. మొదటి నుండి ఈ టికెట్ కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. సొంత పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీల నుండి వచ్చిన వారు కూడా తమకు టికెట్ కేటాయించాలంటూ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. పార్టీ కేడర్ అంతగా లేని నాగార్జున సాగర్ బరిలో నిలవాలంటే.. అన్ని సమీకరణాలు చూసుకున్న తరువాత, ఎలాంటి రెబల్స్ బెడద లేకుండా ఎన్నికలకు వెళ్ళాల్సి ఉంటుందని అధిష్టానం భావిస్తోంది. దీంతో పోటీ పడుతున్న అభ్యర్థుల సంఖ్యను క్రమంగా తగ్గించుకుంటూ వస్తోంది రాష్ట్ర నాయకత్వం. ఆశావహులను ఓ వైపు బుజ్జగిస్తూనే.. బలమైన అభ్యర్థి వేటలో తలమునకలై ఉంది.
నాగార్జున సాగర్ బరిలో కాంగ్రెస్ పార్టీ నుండి జానారెడ్డి ఉన్న నేపథ్యంలో ఆయనను ఢీకొట్టే వారి కోసం పార్టీ వెతుకుతోంది. ఐతే.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత.. గతంలో బీజేపీ నుండి పోటీ చేసిన కంకణాల నివేదితా రెడ్డి అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఐతే.. అనూహ్యంగా నిడమనూరు తహశీల్దార్ కార్యాలయంలో నివేదిత నామినేషన్ వేశారు. బీజేపీ అధిష్టానం బీఫామ్ ఇవ్వకముందే నివేదిత బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం కలకలం రేపుతోంది. మంచి రోజు కాబట్టి నామినేషన్ వేశానని.. బీజేపీ తనకే టికెట్ ఇస్తుందన్న నమ్మకం ఉందంటున్నారు నివేదిత. తాను గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నానని.. కాంగ్రెస్.. టీఆర్ఎస్‌లకు తాను బలమైన పోటీ ఇస్తానంటూ వాదిస్తున్నారు.
ఇక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మరో నేత ఇంద్రసేనారెడ్డి సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతున్నారు. మిగతా వారంతా అధిష్టానం, మీడియా దృష్టిలో పడుతూ తెలిసిన వారితో తమ పేరు చెప్పించుకుంటుంటే.. ఈయన మాత్రం నాగార్జున సాగర్‌లోనే ఉండి అన్నీ చక్కబెడుతున్నట్లు చర్చ జరుగుతోంది. బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత కావడం.. గతంలో జానారెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉండడం.. ఆర్థికంగానూ పటిష్టంగా ఉన్న నేత అన్న అభిప్రాయం ఉండటంతో పాటు.. సాగర్ నియోజక వర్గంలో జానారెడ్డి తరువాత అంతటి పట్టున్న నేతగా పేరు పొందటం ఇంద్రసేనారెడ్డికి ప్లస్ పాయింట్స్ అంటున్నారు స్థానికులు.
ఇక టికెట్ కోసం పోటీ పడుతున్న మరో నేత కడారి అంజయ్య యాదవ్. గతంలో టీడీపీ నుండి పోటీ చేసిన అంజయ్యకు.. 30 వేల ఓట్లను సాధించారన్న పేరుంది. ఖర్చుకు సైతం వెనకాడకుండా పోటీలో ఉంటానంటూ ఆయన అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. తనకు క్షేత్ర స్థాయిలో బలమైన కేడర్ ఉంది.. పార్టీ సింబల్ తోడైతే కచ్చితంగా గెలుస్తానంటూ చెబుతున్నారు. ఇక సాగర్ టికెట్ కోసం ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రవి నాయక్ కూడా ప్రయత్నిస్తున్నారు. వృత్తి రీత్యా వైద్యుడు కావడం తనకు కలిసి వచ్చే అంశమంటున్నారు. నియోజక వర్గంలో తన సామాజిక వర్గానికి చెందిన దాదాపు 40 వేల ఓటర్లు ఉన్నారని.. టికెట్ కేటాయిస్తే ఆ ఓట్లన్నీ తనకే వస్తాయని అధిష్టానం వద్ద చెప్పుకుంటున్నారు.
అయితే.. ఈ నలుగురిలో ఎవరికి టికెట్ కేటాయించాలన్న దానిపై సుదీర్ఘ చర్చలు జరుపుతోంది రాష్ట్ర నాయకత్వం. టికెట్ ఎవరికి ఇచ్చినా.. అంతా కలిసి కట్టుగా పనిచేయాలని సూచిస్తోంది. అందుకు అంతా ఓకే అని చెప్పినా.. చివరి వరకు పార్టీని డ్యామేజ్ చేయకుండా చూసుకుని ఆచితూచి అభ్యర్థిని ప్రకటించే యోచనలో ఉంది బీజేపీ అధిష్టానం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com