నల్గొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 66 మంది ఎలిమినేషన్

నల్గొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 66 మంది ఎలిమినేషన్
మల్లన్న, కోదండరాంలకు రెండో ప్రాధాన్యత ఓట్లు ఎక్కువ వస్తే.. ప్రధాన పోటీదారుల స్థానాలు తారుమారయ్యే అవకాశముంది.

నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల లెక్కిపు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 66 మంది ఎలిమినేషన్ పూర్తైంది. రెండో ప్రాధాన్యతలో ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 25వేల 528 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తొలి ప్రాధాన్యం, రెండో ప్రాధాన్యం ఓట్లు కలిపి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి లక్షా 17వేల 386 ఓట్లు, మల్లన్నకు 91వేల 858 ఓట్లు, కోదండరాంకు 79వేల 110 ఓట్లు వచ్చాయి.

నల్లగొండ– ఖమ్మం– వరంగల్‌ ఎమ్మెల్సీ కోసం 71 మంది అభ్యర్థులు పోటీ చేశారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత పల్లా రాజేశ్వర్‌రెడ్డి మొదటి స్థానంలో, తీన్మార్‌ మల్లన్న రెండో స్థానంలో, ప్రొఫెసర్‌ కోదండరాం మూడో స్థానంలో ఉన్నారు. ప్రథమ ప్రాధాన్యత ఓట్ల పరంగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న కంటే సుమారు ఏడున్నర శాతం ఓట్లు అదనంగా సాధించారు. కోదండరాం కంటే తీన్మార్‌ మల్లన్న సుమారు రెండున్నర శాతం ఓట్లు ఎక్కువ సాధించారు. పల్లా ముందంజలో ఉన్నా మల్లన్న, కోదండరాంలకు రెండో ప్రాధాన్యత ఓట్లు ఎక్కువ వస్తే.. ప్రధాన పోటీదారుల స్థానాలు తారుమారయ్యే అవకాశముంది. బీజేపీ అభ్యర్ధి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధి రాములు నాయక్‌ బ్యాలెట్స్‌లోని రెండో ప్రాధాన్యత ఓట్లు.. పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు మల్లన్న, కోదండరాం గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి. వీరితో పాటు సీపీఐ అభ్యర్థి జయసారధిరెడ్డి, చెరుకు సుధాకర్‌, రాణీరుద్రమ బ్యాలెట్‌లలోని రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా పల్లా, మల్లన్న, కోదండరాం సాధించే ఫలితంపై కొంత మేర ప్రభావం చూపే అవకాశముంది.

ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ చాలా డిఫరెంటుగా ఉంటుంది. చెల్లుబాటయ్యే ఓట్లలో 50శాతానికి ఒక ఓటును వచ్చిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. ఏడు రౌండ్లలో ప్రథమ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయినా.. ఏ అభ్యర్థీ 50శాతం ఓట్లు రాలేదు. దీంతో నిన్న మధ్యాహ్నం నుంచి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. మరోవైపు ఎలిమినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. అంటే అతి తక్కువ ఓట్లు సాధించిన వారిని పోటీ నుంచి తప్పిస్తూ.. వారి బ్యాలెట్‌లో ద్వితీయ ప్రాధాన్యత ఓటును లెక్కించి ఇతరులకు కలిపే ప్రక్రియ కొనసాగుతోంది. ఇలా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ నల్లగొండ– ఖమ్మం– వరంగల్‌ స్థానంలో ఇవాళ్టి మధ్యాహ్నం వరకు, హైదరాబాద్‌– రంగారెడ్డి– మహబూబ్‌నగర్‌ స్థానంలో ఇవాళ్టి అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. 50 శాతం ఓట్లను ఎవరూ సాధించలేకపోతే పోటీలో ఇద్దరు అభ్యర్థులు మిగిలే వరకు ఈ ఎలిమినేషన్‌ ప్రక్రియను కొనసాగిస్తారు. తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఈ ఇద్దరిలో ఎవరికీ 50 శాతం ఓట్లు రాకపోతే గనక.. ఎవరికి ఎక్కువ ఓట్లు ఉంటే వారినే విజేతగా ప్రకటిస్తారు. ఇలాంటి సందర్భంలో ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని విజేతను ప్రకటిస్తారు.


Tags

Read MoreRead Less
Next Story