నల్గొండ, ఖమ్మం, వరంగల్ MLC ఫలితంపై ఉత్కంఠ.. సెకండ్ ప్రిఫరెన్స్‌ అనివార్యం

నల్గొండ, ఖమ్మం, వరంగల్ MLC ఫలితంపై ఉత్కంఠ.. సెకండ్ ప్రిఫరెన్స్‌ అనివార్యం
నల్గొండ, ఖమ్మం, వరంగల్ MLC కౌంటింగ్ మొత్తం ప్రక్రియ పూర్తి కావాలంటే మరో 2 రోజులు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. 3వ రోజు కూడా కౌంటింగ్ కొనసాగుతున్నా ఇంకా ఫలితం తేలలేదు. నల్గొండ- ఖమ్మం-వరంగల్ పట్టభధ్రుల స్థానానికి ఇప్పటికి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఐతే.. విజయానికి అవసరం అయిన 50 శాతం ఓట్లు ఏ ఒక్క అభ్యర్థీ సాధించలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలో పోలైన మొత్తం ఓట్లు 3 లక్షల 87 వేల 969 ఉంటే.. TRS అభ్యర్థి అందరికంటే ఎక్కువగా 1 లక్షా 10 వేల 840 ఓట్లు సాధించారు. ఐతే.. విజయానికి దూరంగానే ఆగిపోయిన నేపథ్యంలో సెకండ్ ప్రిఫరెన్స్‌కి వెళ్లడం అనివార్యం అయ్యింది. ఇప్పటి వరకూ 7 రౌండ్లలో ఓట్లు లెక్కేస్తే.. పల్లాకి 1 లక్షా 10 వేలకుపైగా ఓట్లు వస్తే ఆయనకు గట్టి పోటీ ఇస్తున్నారు తీన్మార్ మల్లన్న. మల్లన్నకు 83 వేల 290 ఓట్లు వచ్చాయి. ఇక TJS కోదండరామ్‌కు 70 వేల 72 ఓట్లు పడ్డాయి. ఆ తర్వాతి స్థానంలో

బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి ఉన్నారు. ఆయనకు 39 వేల 107 ఓట్లు వచ్చాయి. ఒక్కో రౌండ్‌కు ఏకంగా 3 నుంచి 4 గంటలు సమయం పడుతుండడంతో కౌంటింగ్‌కి ఎక్కువ సమయం పడుతోంది.

పోలైన ఓట్లలో దాదాపు 21 వేల 636 ఓట్లు మురిగిపోయాయి. వివిధ కారణాలతో ఇన్ని వేల ఓట్లు ఇన్‌వ్యాలీడ్ కావడం అభ్యర్థుల గెలుపుపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఓటు వేసిన వారంతా పట్టభద్రులే అయినా ఇలా ఇన్‌వ్యాలీడ్ ఓట్లు 21 వేలకుపైగా రావడానికి కారణమేంటో అంతుచిక్కడం లేదు. ఇక రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు వరకూ చూస్తే సమీప ప్రత్యర్థి మల్లన్నపై పల్లా రాజేశ్వర్‌రెడ్డి 27 వేల 550 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయన ఆ మెజార్టీ నిలుపుకుంటూ విజయం సాధిస్తారా.. అనూహ్యంగా సెకండ్ ప్రిఫరెన్స్‌లో మార్పు జరుగుతుందా అనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఎలిమినేషన్ పద్ధతిలో ఇప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థుల్లో తక్కువ ఓట్లు వచ్చిన వారికి సంబంధించిన రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించి వారు ఎవరికి మద్దతు తెలిపారో వారి ఖాతాలో వేస్తారు. ఈ లెక్కన మొత్తం ప్రక్రియ పూర్తి కావాలంటే మరో 2 రోజులు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Tags

Read MoreRead Less
Next Story