వారసుడు కావాలనే అత్యాశతో భార్యను ఆట బొమ్మలా మార్చిన అధికార పార్టీ నేత

వారసుడు కావాలనే అత్యాశతో భార్యను ఆట బొమ్మలా మార్చిన అధికార పార్టీ నేత
X
అల్‌రెడీ పెళ్లై ఇద్దరు ఆడపిల్లలున్నారు. అయినాసరే వారసుడు కావాలనే అత్యాశతో.. రెండో పెళ్లి చేసుకున్నాడు.

ఆడపిల్లపై వివక్ష.. వారసుడు కావాలనే అత్యాశతో ఆమెను ఆట బొమ్మలా మార్చాడు ఓ నీచుడు. వారసుడి కోసం ఏకంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. తీరా కొడుకు పుట్టకపోయేసరికి భార్యకు టార్చర్ మొదలుపెట్టాడు. చివరికి చంపే ప్రయత్నం చేయడంతో తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది ఆ బాధితురాలు. కానీ ఆదుకోవల్సిన పోలీసులు నిందితుడికే వత్తాసు పలికారు. నిందితుడు అధికార పార్టీలో కీలకంగా వ్యవహరిస్తుండడంతో అతడిపై చర్యలకు పోలీసులు వెనుకాడుతున్నారనేది బాధితురాలి ఆరోపణ.

యాదాద్రి-భువనగిరి జిల్లా రామన్నపేటలో వెలుగు చూసింది ఈ దారుణం. రామన్నపేటకు చెందిన ముక్కాముల దుర్గయ్యకు అల్‌రెడీ పెళ్లై ఇద్దరు ఆడపిల్లలున్నారు. అయినాసరే వారసుడు కావాలనే అత్యాశతో భార్యను ఒప్పించి విజయ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి మగ బిడ్డ కోసం రెండో భార్యకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తూనే ఉన్నాడు. ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్ చేయిస్తున్నాడంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. భర్త చేష్టలకు విసిగిపోయిన విజయ... రామన్నపేట పోలీసులను ఆశ్రయించింది. తన భర్త నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసింది. కానీ ముక్కాముల దుర్గయ్య అధికార పార్టీలో కీలకంగా వ్యవహరిస్తుండడంతో అతనిపై ఎస్సై చంద్రశేఖర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు ఆరోపిస్తోంది.

ఎస్సై చంద్రశేఖర్ స్పందించడం లేదని ఆరోపిస్తున్న బాధితురాలు... రాచకొండ సీపీకి ఫిర్యాదు చేసింది. తనను వేధింపులకు గురిచేస్తున్న భర్త దుర్గయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. మరోవైపు తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సై చంద్రశేఖర్‌పై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని బాధితురాలు విజయ డిమాండ్ చేసింది. అయితే పోలీసులు మాత్రం.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదంటున్నారు.

Tags

Next Story