NALINI: ఇదీ నా మరణ వాంగ్మూలం.. ఇక సెలవు

తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం తన డీఎస్పీ ఉద్యోగాన్ని త్యాగం చేసి సంచలనం సృష్టించిన అధికారిణి నళిని పేరు దశాబ్దం తర్వాత మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాజకీయంగా అదృశ్యమైన ఆమె.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి వెలుగులోకి వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమె సేవలను గుర్తించి, ఆమెను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. సీఎం నిర్ణయంపై కృతజ్ఞతలు తెలుపుతూ నళిని స్వయంగా సీఎం రేవంత్‌ను కలుసుకున్నారు. తనకు సర్వీసులో చేరే ఉద్దేశం లేదని ఆమె వెల్లడించారు. ఆ తర్వాత ఆమె పేరు మళ్లీ వినిపించలేదు. తాజాగా.. ఫేస్బుక్లో నళిని సంచలన పోస్టు పెట్టారు. తాను ఇక బతకనని.. ఇది తన మరణ వాంగ్మూలం అంటూ పోస్టు పెట్టారు. నళిని రాష్ట్ర ప్రజలకు రాసిన ఈ బహిరంగ లేఖ సంచలనంగా మారింది. 'తెలుగు రాష్ట్ర ప్రజలకు డీఎస్పీ నళిని బహిరంగ లేఖ ( వీలునామా/ మరణ వాంగ్మూలం) ఒక అధికారిణిగా, ఉద్యమకారిణిగా, రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్య సేవికగా, ఆధ్యాత్మిక వేత్తగా సాగిన నా జీవితం ముగియబోతోంది. నా ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్‌గా ఉంది. ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్లో ఉన్నాను.3 రోజుల నుండి నిద్ర లేదు. రాత్రంతా మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నాను. అని ఆ లేఖలో ఆమె భావోద్వేగంతో తెలిపారు.
రాజకీయాలకు వాడుకోవద్దు
‘‘ నా జీవితం ముగియబోతోంది. సాయం కోసం నేను సీఎంకు పెట్టిన దరఖాస్తు బుట్టదాఖలైంది. ఇప్పటి వరకు నన్ను ఏ నాయకుడూ సన్మానించలేదు. నేను చనిపోయాక రాజకీయ లబ్ధి కోసం నా పేరు వాడుకోవద్దు. ప్రధాని మోదీని కలవలేకపోయాను. నా మరణానంతరం నా లక్ష్య సాధన కోసం మోదీ ఏమైనా చేయాలి. నేను స్థాపించిన వేదామృతం ట్రస్టుకు సాయం చేయాలి. వచ్చే జన్మలో మోక్ష సాధన కోసం ప్రయత్నిస్తా.’’ అని నళిని తన లేఖలో పేర్కొన్నారు. " నా గతమంతా వ్యధ భరితం. తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల నా నిలువెల్లా గాయాలే అయ్యాయి. రాజీనామా ద్వారా నాటి ప్రభుత్వం పన్నిన పద్మవ్యూహంలోంచి బయట పడితే, డిపార్ట్మెంట్ నా వెన్నులో సస్పెన్షన్ అనే బల్లాన్ని కసి తీరా దింపింది. సహాయం చేసేవాడు కనిపించక నొప్పిని భరిస్తూనే 12 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని అనుభవించాను. మీడియా మిత్రులకు విజ్ఞప్తి. నేను చస్తే ఎవరూ సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయకండి. రిజైన్డ్ ఆఫీసర్, కవయిత్రి, యజ్ఞ బ్రహ్మ అని నన్ను సంభోదించండి. నా శరీరానికి జరగాల్సిన అంతిమ సంస్కారం వైదికంగా జరగాలి. రాష్ట్ర నాయకులకు ఒక వినతి. బ్రతుకుండగా నన్ను పట్టించుకొని మీరు రాజకీయ లబ్ధి కోసం నా పేరును వాడుకోవద్దు. అని నళిని తన లేఖలో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com