TG:పట్నం నరేందర్‌రెడ్డికి బెయిల్

లగచర్ల ఘటనలో నిందితులకు నాంపల్లి స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పట్నం నరేందర్ రెడ్డి, పండుగ నారాయణరెడ్డి, ఓడిరెడ్డి సహా 24 మంది నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 50 వేల పూచికత్తు సమర్పించాలని పట్నం నరేందర్ ను కోర్టు ఆదేశించింది. మూడు నెలల పాటు ప్రతీ బుధవారం పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. పోలీసుల విచారణకు సహకరించాలని కూడా ఆదేశించింది. ఈ కేసులో నిందితుడి(ఏ1)గా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డికి కూడా నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ఏ2 సురేష్ తో పాటు మరొకరికి మాత్రం బెయిల్ నిరాకరించింది. ప్రస్తుతం పట్నం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మిగిలిన రైతులు సంగారెడ్డి జైలులో ఉన్నారు. వీరంతా నేడు విడుదలయ్యే అవకాశం ఉంది.
నవంబర్ 11వ తేదీన వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో అధికారులపై దాడి జరిగింది. ఫార్మా పరిశ్రమ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణ కోసం జిల్లా కలెక్టర్ సహా ఇతర అధికారులు వచ్చిన సమయంలో కొందరు కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పలువురు గ్రామస్తులను అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనలో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో.. ఆయన్ని హైదరాబాద్‌లో మార్నింగ్ వాక్ చేస్తుండగా పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com