LOKESH: హృదయం ద్రవించిపోయింది: లోకేశ్

కడప జిల్లా జమ్మలమడుగులో అప్పుడే పుట్టిన ఓ శిశువును ముళ్ల కంపల్లో వదిలేసి వెళ్లిన ఘటన తనను తీవ్రంగా బాధించిందని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. అప్పుడే కళ్లు తెరిచిన శిశువు కష్టం చూసి తల్లడిల్లిపోయానని లోకేశ్ అన్నారు. ముళ్ల కంపల్లో రక్తమోడుతూ కనిపించేసరికి హృదయం ద్రవించిపోయిందన్నారు. శిశువు సంరక్షణ బాధ్యతలను శిశు సంక్షేమ శాఖ తీసుకుంటుందని లోకేశ్ వెల్లడించారు. ఇటువంటి అమానవీయ చర్యకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కోరుతున్నానని లోకేశ్ ట్వీట్ చేశారు.
అసలేం జరిగిందంటే..
ఈ నెల 19వ తేదీన జమ్మలమడుగులోని గని గుంతల వద్ద అప్పుడే కళ్లు తెరచిన మగ శిశువును ముళ్ల పొదల్లో వదిలి వెళ్లారు. మగ శిశువు జననంపై పోలీసులు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరా తీశారు. స్థానికులు, స్థానికేతర మహిళ ప్రసవించారా అని వివరాలు సేకరించారు. పట్టణంలోని అలాంటి వారు లేకపోవడంతో ఇంటిలోనే ప్రసవం జరిగిన తర్వాత బిడ్డ వద్దనుకుని పొదల్లో పడేసి ఉంటారని అంచనాకు వచ్చారు. చిన్నారి బొడ్డుకు క్లిప్ లేకపోవడంతో ఇంటి వద్దే ఎవరైన నర్సు డెలివరీ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. శిశువును మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించినట్లు జమ్మలమడుగు సీడీపీవో రాజేశ్వరి తెలిపారు. బరువు తక్కువగా ఉన్నందున మరికొన్ని రోజులు కడప రిమ్స్‌లోనే వైద్యం చేయిస్తారని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com