Narayana: నారాయణ విద్యాసంస్థల అధిపతి అరెస్ట్.. కుటుంబ సభ్యుల ఆందోళన..

Narayana: ఏపీలో టీడీపీ నేతల టార్గెట్‌గా అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇవాళ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను అరెస్టు చేశారు చిత్తూరు జిల్లా పోలీసులు. ఏపీలో 10వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ, మాల్‌ప్రాక్టీస్ కేసులో చిత్తూరు DEO ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి పొంగూరు నారాయణను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ కొండాపూర్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన బృందం ఆయన్ను ప్రశ్నించి తర్వాత అదుపులోకి తీసుకున్నారు. పదో తరగతి పరీక్షా పత్రాల లీక్, మాల్ ప్రాక్టీస్ వ్యవహారంలోనే ఆయన్ను అరెస్టు చేసినట్టు తెలుస్తున్నా.. ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. గత TDP ప్రభుత్వంలో పురపాలక శాఖ మంత్రిగా కీలక పాత్ర పోషించిన నారాయణను, అమరావతి CRDAకి సంబంధించిన వ్యవహరాల్లో అరెస్టు చేశారా అనే అనుమానాలు వచ్చాయి.
ఐతే.. టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్, మాల్ ప్రాక్టీస్ ఆరోపణలపై అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. కొండాపూర్‌లోని కొల్లా లగ్జూరియాలో ఉన్న ఆయన నివాసానికి వెళ్లిన చిత్తూరు పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన సొంతకారులోనే నారాయణను ప్రస్తుతం చిత్తూరు తీసుకువెళ్తున్నారు. పేపర్‌లీక్‌కి సంబంధించి అక్కడ నమోదైన కేసులోనే అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ క్వశ్చన్ పేపర్ల లీక్, మాల్‌ప్రాక్టీస్ వ్యవహారం ఇటీవల ఏపీలో సంచలనంగా మారింది. ఈ కేసులో 60 మందికిపైగా అధ్యాపకులు, సిబ్బందిపై కేసులు పెట్టారు. కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని సస్పెండ్ చేశారు. చిత్తూరు జిల్లా నారాయణ స్కూల్ నుంచి ఓ ఎగ్జామ్ పేపర్ లీకైనట్టు గుర్తించి.. ఆ స్కూల్ ప్రిన్సిపల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నారాయణను అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదంతా ప్రభుత్వం కుట్రలో భాగమేనని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పరీక్షల నిర్వహణలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వం.. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇలా నారాయణపై నెపం నెట్టి అక్రమంగా అరెస్టు చేశారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. నారాయణను AP పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరిస్తున్నారు.
ఎందుకు అనే కారణం తమకు స్పష్టంగా చెప్పలేదని అంటున్నారు. టెన్త్ పరీక్షల పేపర్ లీకేజీ కేసు పేరు చెప్పి, ఆ ఆరోపణలపై అరెస్టు చేసినట్టు తమకు అనిపిస్తోందని చెప్తున్నారు. అరెస్టు నేపథ్యంలో నారాయణ ఆరోగ్యంపైన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 3 ఏళ్లుగా వరుసగా టీడీపీ నేతల్ని, మాజీ మంత్రుల్ని టార్గెట్ చేస్తూ వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు నారాయణపై అస్త్రం ఎక్కుపెట్టి అరెస్టు చేయడం దారుణమని తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com