NDSA: మేం లేఖలు రాసినా పట్టించుకోలేదు

NDSA: మేం లేఖలు రాసినా పట్టించుకోలేదు
X
నేషనల్‌ డ్యాం సెఫ్టీ ఆధారిటీ వెల్లడి....కోరిన సమాచారం ఇచ్చాకే సమావేశ తేదీని నిర్ణయిస్తామని వెల్లడి

కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతులు, పరీక్షలకు సంబంధించి ఇచ్చిన మధ్యంతర నివేదికలోని సిఫార్సుల అమలు, తదుపరి కార్యాచరణ గురించి తాము లేఖలు రాసినా తెలంగాణ నీటిపారుదల శాఖ పట్టించుకోలేదని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ పేర్కొంది. బోర్‌వెల్‌ డ్రిల్లింగ్‌లో సమస్యల కారణంగా జియోటెక్నికల్‌ పరీక్షలకు ప్రత్యామ్నాయం చూపడానికి మరింత సమాచారం కోరింది. తాము తాజాగా కోరిన సమాచారాన్ని ఇచ్చిన తర్వాత ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీతో నీటిపారుదల శాఖ అధికారుల సమావేశానికి తేదీని నిర్ణయిస్తామని తెలిపింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో జియోటెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా బోర్‌వెల్‌ డేటా కోసం డ్రిల్లింగ్‌ చేపట్టగా లోపలి నుంచి ఇసుక, నీరు రావడంతో పరీక్షలు నిలిపివేసి ప్రత్యామ్నాయం చూపాలని కోరుతూ తెలంగాణ డ్యాం సేఫ్టీ అథారిటీ ఛైర్మన్, ఓ అండ్‌ ఎం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌.. నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీకి లేఖ రాశారు. దీనిపై అథారిటీ సభ్యకార్యదర్శి అమితాబ్‌ మీనా స్పందించి సమాధానమిచ్చారు.


వర్షాకాలం ప్రారంభంలోగా చేయాల్సిన తాత్కాలిక మరమ్మతు పనులు, ఇన్వెస్టిగేషన్స్‌పై ఎన్డీఎస్‌ఏ సిఫార్సులను మే 1న రాష్ట్ర నీటిపారుదల శాఖకు పంపామని లేఖలో అమితాబ్‌ మీనా తెలిపారు. దీనిపై మే 13న, జూన్‌ 25న నీటిపారుదల శాఖ కార్యదర్శికి ఎన్డీఎస్‌ఏ లేఖలు రాసిందన్నారు. తీసుకొన్న చర్యలు, నిపుణుల కమిటీ సిఫార్సుల అమలుకు భవిష్యత్తు కార్యాచరణను తెలపాలని కోరిందని వెల్లడించారు. ఇదే అంశాన్ని జులై 11న మళ్లీ గుర్తుచేసింది. అయినా అమలుకు సంబంధించిన నివేదికను కానీ, తీసుకొన్న మధ్యంతర చర్యల గురించి కానీ, ఇన్వెస్టిగేషన్స్‌కు సంబంధించి, మూడు బ్యారేజీల భవిష్యత్తు కార్యాచరణ గురించి కానీ నీటిపారుదల శాఖ ఏమీ చెప్పలేదన్నారు. జులై 5న రాసిన లేఖలో.. అన్నారం బ్యారేజీ రాప్ట్‌లో బోర్‌వెల్‌ డ్రిల్లింగ్‌ చేసేటప్పుడు నీరు, ఇసుక ఎక్కువగా రావడం గుర్తించి పరీక్షలు నిలుపుదల చేశామని, జియోటెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌కు ప్రత్యామ్నాయం చూపమని కోరారు.

ఈ అంశాన్ని కమిటీ పరిశీలించింది. కారణాలను విశ్లేషించి ప్రత్యామ్నాయం సూచించడానికి నీటిపారుదల శాఖ ఇచ్చిన వివరాలు ఏ మాత్రం సరిపోవు. అన్నారం, వర్షాకాలం ప్రారంభానికి ముందు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో చేయాల్సిన పనులపై చేసిన సిఫార్సులు ఏమేరకు అమలు జరిగాయి? సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ అభిప్రాయమేంటి తదితర వివరాలతో నివేదిక పంపగలరు. మూడు బ్యారేజీలకు సంబంధించి తీసుకొన్న చర్యలను ఫొటోలతో సహా పంపడంతోపాటు మిగిలిన పని వివరాలు పొందుపరచాలి. ఇన్వెస్టిగేషన్స్‌పై నివేదిక పంపడంతోపాటు బోర్‌వెల్‌ డ్రిల్లింగ్‌కు సంబంధించి తాము అడిగిన వివరాలన్నింటినీ 17వ తేదీలోగా పంపాలి. నిపుణుల కమిటీ సభ్యులతో ఢిల్లీలో సమావేశం కోసం ఈ నెల 12న నీటిపారుదలశాఖ మరో లేఖ రాసింది. తాము అడిగిన వివరాలు అందజేసిన తర్వాత పరిశీలించి సమావేశం తేదీని చెబుతామని లేఖలో ఎన్డీఎస్‌ఏ సభ్యకార్యదర్శి స్పష్టం చేశారు.

Tags

Next Story