AP: కిక్కిరిసిన హైదరాబాద్- విజయవాడ హైవే
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వాతావరణం మొదలైంది. సొంత ఊరిలో సంక్రాంతిని బంధుమిత్రులతో కలిసి జరుపుకొనేందుకు ప్రజలు ఎవరి సొంత వాహనాల్లో వారు బయలుదేరడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. ఎల్బీనగర్ కూడలి వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీతో పాటు వ్యక్తిగత వాహనాలతో ఎల్బీనగర్ నుంచి పనామా వరకు ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది.
హైవేపై వాహనాల రద్దీ
సంక్రాంతి పండుగను ప్రజలు ఊరిలో జరుపుకొనేందుకు సొంత వాహనాల్లో బయలుదేరడంతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. శనివారం నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో పిల్లలతో కలిసి కుటుంబ సభ్యులంతా కార్లు, ఇతర వాహనాల్లో బయలు దేరారు. దీంతో వేలాది వాహనాలు ఒక్కసారిగా రోడ్డెక్కాయి. మరో వైపు పంతంగి టోల్ ప్లాజా వద్ద కొన్ని నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోతున్నాయి.
నేడు, రేపు మరింత రద్దీ
శని, ఆదివారాల్లో ఈ రద్దీ మరింత అధికంగా ఉండనుంది. పైగా ఆదివారం చౌటుప్పల్‌లో సంత జరుగుతుంది. అప్పుడు హైవేపై వెళ్లే వాహనాలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. మరోవైపు చౌటుప్పల్‌లో అండర్‌పాస్ నిర్మిస్తుండటంతో రాకపోకలకు ఇప్పటికే సమస్యగా ఉంది. వీటన్నింటి కారణంగా సంక్రాంతికి వెళ్లే వాహనదారుల కోసం పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com