NAVEEN YADAV: "ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా"

జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేసి, తనను ఆదరించిన ప్రజల నమ్మకాన్ని పూర్తి స్థాయిలో నిలబెట్టుకుంటానని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. “ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకొని, ఇక్కడ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు బాగుంటుందని ఇచ్చిన ఆశీర్వాదం వృథా పోదు,” అని నవీన్ యాదవ్ అన్నారు. గతంలో దాదాపు 200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేసిన ఆయన, ప్రజల నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేస్తానని హామీ ఇచ్చారు. కక్షపూరిత రాజకీయాలు చేసి ఉండవచ్చని పరోక్షంగా పేర్కొంటూ.. “నవీన్ యాదవ్ దగ్గర అటువంటివి ఉండవు. ఈరోజు వరకే మీరు-మేము. ఇప్పటి నుండి మనం అంతా ఒకటే,” అని భరోసా ఇచ్చారు.
ఓటములనే మెట్లుగా చేసుకుని...
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపొందారు. ఎన్నికల అధికారులు నవీన్ యాదవ్ గెలుపుని అధికారికంగా ప్రకటించారు. నవీన్ యాదవ్ విషయానికి వస్తే ఓటములనే మెట్లుగా చేసుకుని ఈరోజు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009 యూసఫ్ కూడా డివిజన్ నుంచి ఎంఐఎం పార్టీ నుంచి కార్పొరేటర్ గా నిలిచి తెలుగుదేశం అభ్యర్థి మురళి గౌడ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో ఎంఐఎం నుంచి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేసి 41 వేల ఓట్లు తెచ్చుకొని రెండో స్థానంలో నిలిచారు. అలాగే 2015లో మరోసారి ఎంఐఎం అభ్యర్థిగా రహమత్ నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నా, ఎక్కువ ఓట్లు వస్తాయని అంచనా వేసిన ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు.
2018 లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 19 వేల ఓట్లు తెచ్చుకున్నారు. ఇలా మొత్తం నాలుగు సార్లు రెండుసార్లు కార్పొరేటర్ గా రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి నాలుగు సార్లు ఓడిపోయారు. అయినా కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానికుడు గా మంచి ముద్ర వేసుకున్నారు. చివరకు 2023 సాధారణ ఎన్నికలకు నెల రోజులు ముందు నవంబర్ 15న అప్పటి పిసిసి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి సమక్షంలో నవీన్ కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పట్నుంచి కొనసాగుతున్నారు. 42 సంవత్సరాల వయసు ఉన్న నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్. భార్య పేరు వర్ష, కుమారుడు అన్ష్ యాదవ్. నవీన్ యాదవ్యూసఫ్గూడలో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు.
చరిత్రలోనే తొలిసారి...
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపినాథ్‌పై 24,658 వేల ఓట్ల మెజార్టీతో గెలుపు కైవసం చేసుకున్నారు. ఈ విజయంతో నవీన్ యాదవ్ నయా రికార్డ్ సృష్టించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందిన వ్యక్తిగా ఘనత సాధించారు. జూబ్లీహిల్స్ నియోజవర్గంలో ఇప్పటివరకు అత్యధిక మెజార్టీ పీజేఆర్ కుమారుడు విష్ణు పేరిట(2009లో 21,741) ఉండేది. ఇక, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ 2014లో 9,242, 2018లో 16,004, 2023లో 16,337 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,658 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించి నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజార్టీ సాధించిన వ్యక్తిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో చివరకు అధికార కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

